కాలా సినిమా.. మరోసారి రజనీ విజ్ఞప్తి
చెన్నై : రజనీకాంత్ తాజా చిత్రం ‘కాలా’ కర్ణాటకలో విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ సినిమా విడుదలకు సుప్రీంకోర్టు, హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినప్పటికీ.. కన్నడ సంఘాలు వెనక్కి తగ్గడం లేదు. కావేరి జలాల విషయంలో కర్ణాటక మనోభావాలకు భిన్నంగా రజనీకాంత్ వ్యాఖ్యలు చేశారని, ఆయన సినిమాను రాష్ట్రంలో ఆడనిచ్చేది లేదని కన్నడ సంఘాలు తెగేసి చెప్తున్నాయి. ఇక, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా ‘కాలా’ సినిమాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని ఉద్రిక్తతలు, ప్రజల మనోభావాలు దృష్టిలో పెట్టుకొని కాలా సినిమా విడుదలను నిలిపేయాలని ఆయన పంపిణీదారులను, నిర్మాతను సూచించారు.
అయితే, రజనీకాంత్ మాత్రం ‘కాలా’ సినిమా కర్ణాటకలో విడుదల అవుతుందని ధీమాగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్ సిలిగురిలో ఉన్న ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. నిర్మాతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, కర్ణాటకలో తన సినిమా తప్పకుండా విడుదల అవుతుందని ఆయన అన్నారు. సినిమా విడుదలకు సహకరించాలని ఆయన కర్ణాటకలోని అన్నివర్గాల వారికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే సినిమా విడుదలకు సహకరించాలని కర్ణాటక సీఎం కుమారస్వామికి కూడా రజనీ విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో రేపు కర్ణాటకలో ఈ సినిమా విడుదల అవుతుందా? లేదా? అన్నది ఉత్కంఠ రేపుతోంది.