Kalabhavan Manis Death
-
సహనటులే విషం పెట్టి చంపారా?
తిరువనంతపురం: దక్షిణాధి భాషల్లో నటించి మంచి పేరు గడించిన కళాభవన్ మృతి వెనుక పలు రహస్యాలు వెలుగుచూసే అవకాశాలు ఉన్నాయి. ఆయన దేహంలో ఎంతో ప్రమాదకరమైన విషపదార్థాలను వైద్యులు గుర్తించడంతో పోలీసులు ఈ కేసును ప్రత్యేకంగా భావిస్తున్నారు. కళాభవన్ అత్యంత సన్నిహితంగా ఉండే నటులు జాఫర్ ఇడుక్కి, థరికిదా సాభులను ఇంకొందరని శనివారం మధ్యాహ్నం నుంచి విచారించడం ప్రారంభించారు. అయితే, వీరే ఏదైనా దురాగతానికి పాల్పడి ఉంటారా లేక ఆ ఘటనకు సంబంధించిన సమాచారం ఏదైనా దొరుకుతుందనే ఉద్దేశంతో వారిని విచారిస్తున్నారా అనే విషయాన్ని మాత్రం పోలీసులు స్పష్టం చెప్పడం లేదు. ఏదేమైనా రెండు మూడురోజుల్లో ఆయన డెత్ మిస్టరీ మాత్రం వీడిపోతుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. -
కళాభవన్ మణి దేహంలో విషపదార్ధాలు
కొచ్చి: విలక్షణ నటుడు కళాభవన్ మణి మృతిపై మిస్టరీ వీడలేదు. కళాభవన్ మణి మరణం వెనుక ఏదైనా కుట్ర ఉందా అనేది ఇంకా తేలలేదు. ఆయన దేహంలో విషపదార్ధాలు ఉన్నట్టు టాక్సీకాలజీ రిపోర్ట్ లో వెల్లడైంది. ఆయన మృతదేహం నుంచి సేకరించిన నమూనాకు కొచ్చిలోని కక్కనాడ్ ప్రాంతీయ రసాయన పరీక్షా కేంద్రంలో టాక్సికాలజీ టెస్టులు చేశారు. ప్రమాదకరమైన క్రిమిసంహారిణి 'క్లోర్ పిరిఫొస్' అవశేషాలు ఉన్నట్టు పరీక్షల్లో వెల్లడైంది. దీంతో పాటు మిథైల్, ఇథైల్ ఆల్కహాల్ కూడా ఉన్నట్టు తేలిందని జాయింట్ కెమికల్ ఎగ్జామినర్ కె. మురళీధరన్ నాయర్ చెప్పారు. ఎవరైనా ఆయనకు విషపదార్దాలు ఇచ్చారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. 45 ఏళ్ల కళాభవన్ మణి ఈ నెల 6న కొచ్చిలోని తన నివాసంలో మృతి చెందారు. కాలేయ సంబంధ వ్యాధితో ఆయన మరణించినట్టు భావించారు. పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేశారు. కళాభవన్ మణి సహాయకులు ముగ్గురిని ప్రశ్నించారు. ఆయన మరణంపై అనుమానాలున్నాయని మణి భార్య నిమ్మె చెప్పారు. తమ కుటుంబంలో ఎటువంటి కలతలు లేవని ఆమె స్పష్టం చేశారు. ఆయనకు స్నేహతులు మద్యం తాగడం అలవాటు చేశారని వెల్లడించారు. అటాప్సి రిపోర్ట్ వచ్చిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తామని మణి సోదరుడు ఆర్ ఎల్వీ రామకృష్ణన్ తెలిపారు.