‘కళాపురం’మూవీ రివ్యూ
టైటిల్ : కళాపురం
నటీనటులు : సత్యం రాజేష్, ప్రవీణ్ యండమూరి, కాశీమా రఫి, చిత్రం శ్రీను, సన, జబర్దస్త్ అప్పారావు తదితరులు
నిర్మాణ సంస్థలు: ఆర్4 ఎంటర్టైన్మెట్స్
నిర్మాతలు: రజనీ తాళ్లూరి
దర్శకత్వం: కరుణకుమార్
సంగీతం : మణిశర్మ
విడుదల తేది: ఆగస్ట్ 26, 2022
పలాస, శ్రీదేవి సోడా సెంటర్ లాంటి చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు దర్శకుడు కరుణ కుమార్. ఆయన నుంచి తాజా చిత్రం ‘కళాపురం’. సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం నేడు(ఆగస్ట్ 26)విడుదలైంది. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
‘కళాపురం’ కథేంటంటే..
కుమార్(సత్యం రాజేష్) సినిమా పరిశ్రమలో దర్శకుడిగా రాణించాలని ప్రయత్నిస్తుంటాడు. అతని స్నేహితుడు ప్రవీణ్(ప్రవీణ్ యండమూరి)డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా చేస్తున్నాడని తెలుసుకొని హైదరాబాద్ వస్తాడు. ఇద్దరు కలిసి సినిమాల కోసం నిర్మాతల ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటారు. ఇదే సమయంలో కుమార్ ప్రాణంగా ప్రేమించిన ఇందు(కాశిమా రఫి)చేతిలో మోసపోతాడు.
దీంతో సినిమా ప్రయత్నాలు ఆపి, ఉద్యోగం చేసుకుందామనే సమయంలో అప్పారావు అనే నిర్మాత కలిసి సినిమా చేద్దామని చెప్తాడు. అతని కారణంగానే కుమార్ కళాపురం అనే ఊరికి వెళ్తాడు. అక్కడ కుమార్‌కి ఎదురైన పరిస్థితుల ఏంటి? కళాపురంలో శారద(సంచిత)తో పరిచయం కుమార్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపింది? చివరకు కుమార్ సినిమాని తెరకెక్కించాడా లేదా? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
చిత్ర పరిశ్రమ ఉండే మోసాలు, కష్టాలపై గతంలో చాలా సినిమాలు వచ్చాయి. ‘కళాపురం’కూడా అదే కోవకు చెందినదే. కాకపోతే కరుణ కుమార్ ఈ సినిమాతో అంతర్లీనంగా చెప్పిన కథ, చివర్లో ఇచ్చిన ట్విస్ట్‌కు ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురవుతారు. అయితే నటీనటుల ఎంపిక విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించి, కథను పూర్తి స్థాయిలో విస్తరించి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. పేరున్న నటీనటులు లేకపోవడం వల్ల సినిమా పూర్తిస్థాయిలో ప్రేక్షకులను కనెక్ట్ కాలేకపోయింది. ఎలాంటి అశ్లీలత లేకుండా చక్కటి వినోదాన్ని పంచే ప్రయత్నం చేశాడు దర్శకుడు. లాజిక్స్ వెతక్కుండా చూస్తే ‘కళాపురం’ఎంజాయ్ చేసేయోచ్చు.
ఎవరెలా చేశారంటే..
చాలా కాలం తర్వాత రాజేష్ ఫుల్లెంత్ పాత్ర చేశాడు. కుమార్ పాత్రలో ఆయన మెప్పించాడు. కామెడీ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా చక్కటి నటనను కనబరిచాడు. కుమార్ స్నేహితుడు ప్రవీణ్ పాత్రలో ప్రవీణ్ యండమూరీ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్లుగా సంచిత, కాశీమా తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన వాళ్లంతా కొత్త వాళ్లే అయినప్పటికీ.. తమ పాత్రల పరిధిమేర బాగానే నటించారు. ఇక సాంకేతిక విషయానికి వస్తే.. మణిశర్మ సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయినా.. నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.