బీఆర్ఎస్లో విభేదాలు.. బయటపడ్డ ఎమ్మెల్యే, కార్పొరేటర్ మధ్య వార్
సాక్షి, హైదరాబాద్: అంబర్‌పేట అధికార బీఆర్ఎస్ పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్ మధ్య వివాదం మరింత ముదిరింది. మంగళవారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌కు, గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య, ఆమె భర్త శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ క్రమంలో పూలే విగ్రహానికి పూలమాల వేసే సమయంలో ఎమ్మెల్యే, కార్పొరేటర్ మధ్య వ్యాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఇరు వర్గాల కార్యకర్తలు, అనుచరులు రోడ్డు మీదనే ఘర్షణకు దిగారు.
అయితే కార్పొరేటర్ లావణ్య భర్త శ్రీనివాస్‌పై ఎమ్మెల్యే వెంకటేష్ చేయి చేసుకున్నారని ఆమె వర్గం ఆరోపిస్తుంది. మహాత్మాజ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసే సమయంలో ఎమ్మెల్యే తనను నెట్టుకుంటూ వెళ్లాడని కార్పొరేటర్ లావణ్య భర్త శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. అంతేగాక గత కొంత కాలం నుంచి నియోజకవర్గం అభివృద్ధి పనుల్లో తనను ఆహ్వానించడం లేదని కార్పొరేటర్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ డివిజన్లో జరిగిన ఆత్మీయ సమ్మేళన సభలో కూడా తమను అవమానించేలా ఎమ్మెల్యే వ్యవహరించారని అన్నారు.