‘ఉపాధి’ నిలిపివేతపై కన్నెర్ర
కల్హేర్: ఉపాధి హమీ పథకం కింద పనులు నిలుపుదల చేశారని కూలీలు అధికారులపై కన్నెర్ర చేశారు. పనులు చేసిన డబ్బులు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా పనులు చేసేందుకు మస్టర్లు ఇవ్వడం లేదని అరోపించారు. పలువురు కూలీలు ఎంపీడీఓ మల్లేశ్వర్, ఈజీఎస్ ఎపీఓ పెంటయ్యను ఘెరావ్ చేశారు. కోందరు మహిళలు ఎపీఓ పెంటయ్యపై దాడికి యత్నించారు. సోమవారం మండలంలోని కృష్ణపూర్కు చెందిన కూలీలు కల్హేర్ మండల పరిషత్తు కార్యాలయాన్ని ముట్టడించారు.
అంతకు ముందు గ్రామ శివారులో ఉపాధి పనులకు వెళ్లిన కూలీలు అక్కడ హాజరు మస్టర్లు అందుబాటులో లేకపోవడంతో అక్కడే ఆందోళనకు దిగారు. 400 మంది వరకు కూలీలు ట్రాక్టర్లలో మండల పరిషత్తుకు చేరుకున్నారు. కార్యాలయం లోపలికి చోచ్చుకెళ్లి నిరసన చేపట్టారు. ఎంపీడీఓ మల్లేశ్వర్, ఎపీఓ పెంటయ్య అందుబాటులో లేకపోవడంతో బయట బైఠాయించారు. ఎపీఓకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాదాపు మూడు గంటలు ఆందోళన చేశారు.
గ్రామ సర్పంచ్ అదేశాల మేరకు మస్టర్లు ఇవ్వకుండా ఉపాధి పనులను నిలుపుదల చేశారని కూలీలు ఆరోపించారు. తహశీల్దార్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ముగించుకుని ఎంపీడీఓ మల్లేశ్వర్ అక్కడికి రావాడంతో కూలీలు తమ గోడును వినిపించారు. మధ్యాహ్నం 2 గంటలకు ఏపీఓ పెంటయ్య అక్కడికి రావాడంతో కూలీలు ఆయనపై దౌర్జన్యానికి దిగారు. మరి కోందరు ఏపీఓపై దాడికి ప్రయత్నించారు.
మహిళలు ఎంపీడీఓ, ఎపీఓను శాపనార్థలు పెట్టి దౌర్జన్యానికి దిగారు. సీఐటీయూ డివిజన్ నాయకులు సంగమేశ్వర్, పలువురు కాంగ్రెస్ నాయకులు కూలీలకు మద్దత్తు పలికారు. సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో కూలీలు శాంతించారు. ఈ విషయమై ఎపీఓ పెంటయ్యతో ‘సాక్షి’ ప్రస్తావించగా కృష్ణపూర్లో ఉపాధి పనులు నిలుపుదల చేయాలేదని తెలిపారు.పనులకు సంబంధించి మస్టర్లు ఇస్తున్నామని చెప్పారు. సర్పంచ్ వనజ మాట్లాడుతూ గ్రామనికి చెందిన ఫీల్డ్అసిస్టెంట్, కొందరు రాజకీయం చేసి కూలీలను రెచ్చగొడుతున్నారన్నారు.