Kaloji Foundation
-
సోషల్ మీడియాకు బందీ కావొద్దు
సాక్షి, హైదరాబాద్: ఇప్పటి తరాన్ని స్మార్ట్ ఫోన్ నిర్వీర్యం చేస్తోందని.. సోషల్ మీడియా బందీగా మార్చిందని ప్రముఖ కవి, రచయిత, చరిత్ర పరిశోధకుడు శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో మునిగిపోయినప్పుడు ఎన్నో విషయాలు తెలుసుకున్నట్టే అనిపిస్తుందని.. కానీ ఏమీ తెలియకుండా పోతుందని చెప్పారు. శుక్రవారం ఆయన కాళోజీ నారాయణరావు స్మారక పురస్కరాన్ని అందుకున్నారు. అనంతరం ‘సాక్షి’తో మాట్లాడారు. ‘‘నేను ఎనిమిదో తరగతి నుంచి కవిత్వం రాయడం అలవాటు చేసుకున్నా. అది నాలో ఆలోచనా శక్తిని ఉత్తేజపర్చింది. సమాజాన్ని అన్ని కోణాల్లో చూసే తత్వాన్ని కలిగించింది. అన్యాయం జరిగితే ప్రశ్నించడం, బాధితుల పక్షాన నిలదీయటం, ఎదిరించటం అలవాటు చేసింది. ఇప్పటితరంలో ఇది లోపించింది. రాయకున్నా కనీసం చదివే లక్షణమైనా ఉండాలి..’’ అని శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. భాషను ముందు తరాలకు అందించాలి తెలంగాణ భాషను రేపటి తరానికి పదిలంగా అందించాల్సిన బాధ్యత మనపై ఉందని.. అది రచనలతోనే ముందుకు సాగుతుందని శ్రీరామోజు హరగోపాల్ అన్నారు. ‘బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష కావాలని కాళోజీ చెప్తూ చేసి చూపించారని.. ఆ దిశగానే తానూ ముందుకు సాగానని చెప్పారు. తమ రచన సాహితీ కళావేదిక తొలి వార్షికోత్సవానికి కాళోజీ ముఖ్య అతిథిగా వచ్చి ఓ రోజంతా తమతో గడిపారని గుర్తు చేసుకున్నారు. సమాజంలో చోటుచేసుకునే పరిణామాలకు మనం స్పందించగలగాలని.. ఆ తత్వం మనసుకు ఉండాలని చెప్పారు. చాలా మందిలో ఈ తత్వం ఉన్నా దాన్ని గుర్తించరని.. రచనా వ్యాసంగం వైపు మళ్లినప్పుడు అది ఉత్తేజం పొందుతుందని తెలిపారు. సమాజాన్ని గమనించటం, పుస్తకాలు చదవడం మేధస్సుకు పదును పెడుతుందన్నారు. దీనిని నేటి తరం గుర్తించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వైతాళికులను గుర్తించి వారికి సముచిత గౌరవాన్ని కల్పిస్తోందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కాళోజీ జయంతిని అధికారికంగా నిర్వహించడంతోపాటు ఆ రోజును తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించిందని గుర్తు చేశారు. శుక్రవారం రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి శ్రీరామోజు హరగోపాల్‌కు కాళోజీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ, కవి గోరటి వెంకన్న, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సాహిత్య అకాడమీ చైర్మన్ గౌరీశంకర్ పాల్గొన్నారు. – గన్‌ఫౌండ్రి ఇదీ చదవండి: పాన్ ఇండియా పార్టీ.. దరసరాకు విడుదల! -
అందెశ్రీకి కాళోజీ ఫౌండేషన్ పురస్కారం
కేయూ క్యాంపస్ : కాళోజీ ఫౌండేషన్ పురస్కారాన్ని 2016 సంవత్సరానికిగానూ ప్రముఖ కవి అందెశ్రీకి ప్రదానం చేయనున్నట్లు కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి తెలిపారు. శనివారం కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ‘కాళోజీ ఎండోమెంట్ లెక్చర్’ సెమినార్లో ప్రసంగిస్తూ ఆయన ఈవిషయాన్ని వెల్లడించారు.కాళోజీ వర్ధంతిని పురస్కరించుకొని నవంబర్ 13న అందెశ్రీకి పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. -
మండే కన్నీటి బిందువు కాళోజీ
హన్మకొండ కల్చరల్ : కాళోజీ నారాయణరావు మండే కన్నీటి బిందువని, నిలువెత్తు మానవత్వానికి ప్రతీకగా నిలిచాడని న్యాయమూర్తి మంగారి రాజేందర్ (జింబో) అన్నారు. హన్మకొండ హంటర్‌రోడ్‌లోని వరంగల్ పబ్లిక్ స్కూల్లో కాళోజీ ఫౌండేషన్, మిత్రమండలి ఆధ్వర్యంలో గురువారం కాళోజీ సోదరుల యాది సభ జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కాళోజీ నారాయణరావు, కాళోజీ రామేశ్వర్రావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాళోజీ ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు ఎస్.జీవన్‌కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంగారి రాజేందర్ మాట్లాడుతూ ఉర్దూ భాష భారతదేశంలోనే పుట్టిందన్నారు. పాకిస్తాన్లో అధికార భాష ఉర్దూ అయినప్పటికీ... ఆ భాషను భారతదేశ ప్రజలే ఎక్కువగా మాట్లాడతారని తెలిపారు. అదేవిధంగా సంస్కృతం హిందూ మతానికి చెందినదిగా భావించడం తప్పన్నా రు. న్యాయవ్యవస్థతోనూ, మనుషులతోనూ, మానవీయ విలువలతోనూ సంబంధం ఉన్న ప్రజల మనిషి పరిపూర్ణ మానవుడు కాళోజీ అని కొనియూడారు.తెలంగాణ వచ్చిన తర్వాత కాళోజీ వర్ధంతి సభకు వందలాది మంది వస్తారని ఆశించామని, అలా జరగకపోవడం బాధాకరమేనన్నారు. ప్రస్తుతం కవిత్వం అనేది ఫేస్బుక్ ద్వారా చర్చలో ఉందన్నారు. డాక్టర్ ఎం.విజయ్‌కుమార్ మాట్లాడుతూ కాళోజీ రామేశ్వర్రావు రాసిన ఉర్దూ సాహిత్యంలోని విశేషాలను వివరించారు. ఎస్.జీవన్‌కుమార్ మాట్లాడుతూ కాళోజీ రామేశ్వర్‌రావుకు ఉర్ధూ అంటే ఎనలేని మక్కువ అని... చెరుకు గడలోని తీపి రసంలా ఉంటుందని అనేవారని గుర్తుచేశారు. కాళోజీ నారాయణరావు విషయానికి వస్తే ప్రజాస్వామ్యం గురించి ఆయన రాసినంతగా ఎవ్వరూ రాయలేరని, ప్రభుత్వ జవాబుదారీతనం గురించి అడిగేవారని పేర్కొన్నారు. కర్షకా నీ కర్రు కదిలినన్నాల్లే అన్న కవితను ఈనాటి పరిస్థితులలో గుర్తుంచుకోవాల్సిన అవసరముందన్నారు. నాగిళ్ల రామశాస్త్రి మాట్లాడుతూ కాళోజీ అవార్డును సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్‌రెడ్డికి ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన లండన్‌లో ఉన్నందున మరో ప్రత్యేక సమావేశంలో అవార్డును అందజేయనున్నట్లు తెలిపారు. పొట్లపల్లి శ్రీనివాసరావు వందన సమర్పణ చేశారు. కవి లోచన్, కాళోజీ కుమారుడు రవికుమార్, పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్, శోభ దంపతులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు డాక్టర్ అంపశయ్య నవీన్, ఆచార్య కాత్యాయని విద్మహే, టి.జితేందర్‌రావు, మహ్మద్ సిరాజూద్దిన్, అన్వర్, కుందావజుజల కృష్ణమూర్తి, చెలిమె సుధాకర్, బిల్లా మహేందర్, రంగ చక్రపాణి, పొట్లపల్లి ధరణీశ్వర్‌రావు, రంగు చక్రపాణి, కాళోజీ అభిమానులు పాల్గొన్నారు.