ఎన్ని‘కల’..పెళ్లికొడుకు!
నిన్న మొన్నటి వరకు నేనే అభ్యర్థిని అనుకున్నాడు... ఆరు నెలల క్రితం నుంచే బరిలో నిలిచి గెలిచేందుకు స్కెచ్చేశాడు. అన్నీ బాగున్నాయి..అధిష్టానం ఆశీస్సులూ ఉన్నాయి.. నాకు తిరుగు లేదనుకున్నాడు. శుక్రవారం సాయంత్రానికి సీను మారింది. రిజర్వేషన్ల ప్రకటనతో ఆ యువ నేతకు అంతులేని ఆశాభంగమైంది. తాను ఆశించిన స్థానం మహిళకు రిజర్వు చేయడంతో ఖంగుతిన్నాడు. ఒక రోజు గడిచింది... ఆలోచన మారింది. ఆశలు మళ్లీ చిగురించాయి. అర్జంట్‌గా పెళ్లి చేసుకుని.. తన భార్యనే పోటీలో దింపితే ఎలా ఉంటుందని ఆలోచన చేశాడు. ఎన్నికల ‘పెళ్లి’కి సిద్ధమవుతున్నాడు... ఇదీ కవాడిగూడ డివిజన్ (వార్డు నెం.90) నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేయాలనుకున్న టీఆర్ఎస్ నేత కల్వ గోపి కథ. గతంలో ఈ స్థానం ఎస్సీ జనరల్‌కు ఉంది.
ఈసారి కూడా అదే ఉంటుందనుకున్నాడు. మరోవైపు హోం మంత్రి నాయిని కూడా నీకే టికెట్ అంటూ భరోసానిచ్చారు. కానీ రిజర్వేషన్లు గోపి కలను కల్లలు చేశాయి. ఇక పెళ్లి చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదనుకుని ఆయన..ఆ ప్రయత్నాల్లో బిజీగా ఉన్నట్లు ఇక్కడ జోరుగా విన్పిస్తోంది. సీటిస్తానని మాటిస్తే వెంటనే పెళ్లి చేసుకోవడానికి తాను సిద్ధమని ఆయన టీఆర్ఎస్ అగ్రనేతలకు సంకేతాలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద సీటు మీద ఆశ..పెళ్లికి దారి తీస్తోందని స్థానికులు చర్చించుకుంటున్నారు.
- కవాడిగూడ