లోక రక్షకుడు ఏసు
- ఘనంగా కల్వరి క్రిస్మస్ సెలబ్రేషన్స్ ప్రారంభం
కర్నూలు (టౌన్): లోక రక్షకుడు ఏసు అని హైదరబాద్‌కు చెందిన అంతర్జాతీయ వర్తమానికులు పి. సతీష్ కుమార్ అన్నారు. పాపులను రక్షించేందుకు ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారన్నారు. సోమవారం రాత్రి కర్నూలు నగరంలోని బిర్లా కాంపౌండ్‌లో కల్వరి క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నాలుగు రోజుల పాటు జరిగే వేడుకల్లో ముఖ్య అతిథిగా సతీష్ కుమార్ మాట్లాడుతూ.. ఏసు భోదనల ద్వారా పాపవిముక్తులు కావాల్సిన సమయం అసన్నమైందన్నారు. ప్రతి ఏడాది క్రీస్తు జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. దేవుని అడుగుజాడల్లో నడుస్తూ క్రైస్తవులు సన్మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. వేడుకలకు కర్నూలుతో పాటు అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల నుంచి కల్వరి పాస్టర్లు, సభ్యులు వేలాదిగా తరలి వచ్చారు. కల్వరి మినిస్ట్రిస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ ప్రాధాన్యం, క్రీస్తు పుట్టుక నాటికలు ప్రదర్శించారు.