Kalyanamandapam
-
కల్యాణ మండపం ఏర్పాటుకు కృషి
–ఎంపీ బుట్టారేణుక ఆదోని: పట్టణంలోని విశ్వబ్రాహ్మణ సమాజానికి కల్యాణ మండపం ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక హామీ ఇచ్చారు. బుధవారం ఆమె స్థానిక షరాఫ్ బజారులోని కాళికాకమఠేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవానికి హాజరయ్యారు. ఉత్సవాల నిర్వాహకులు మేళతాళాలతో ఆమె స్వాగతం పలికారు. ఎంపీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో కొంత స్థలం ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇక్కడ కల్యాణ మండపం నిర్మించాలని విశ్వబ్రాహ్మణ సమాజం పెద్దలు కోరారన్నారు. మండపం నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ నిధులు వెచ్చించవచ్చో లేదో పరిశీలిస్తానన్నారు. పట్టణ ప్రజలు కలిసిమెలిసి ఉత్సవాలు జరుపుకోవడం తనకు ఎంతో సంతోషం కలిగిస్తోందన్నారు. అనంతరం సమాజం మహిళలు బుట్టా రేణుకకు చీర,సారె బహూకరించగా సమాజం పెద్దలు శాలువ కప్పి సత్కరించారు. స్వర్ణకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కరివేణుమాధవ్, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ధనుంజయ ఆచారి, పట్టణ ప్రముఖులు చంద్రకాంత్‌రెడ్డి, రామలింగేశ్వర యాదవ్, సంఘం అధ్యక్ష కార్యదర్శులు శిల్పి గుండాచారి, శ్రీనివాస ఆచారి, ఉపాధ్యక్షుడు మహేష్ ఆచారి, కార్యదర్శి అనిల్ ఆచారి, సంఘం ప్రముఖులు రవికుమార్ ఆచారి, శ్రీకాంత్ ఆచారి, జగదీష్ ఆచారి తదితరులు పాల్గొన్నారు. -
సత్యదేవుని సన్నిధిలో అక్రమాలు
గుడ్లవల్లేరు, న్యూస్‌లైన్ : కొంతమంది టీడీపీ, కాంగ్రెస్ నాయకులు అక్రమ వసూళ్లకు పాల్పడుతూ సత్యదేవునికే శఠగోపం పెడుతున్నారు. గుడ్లవల్లేరు సంతరోడ్డులో ఉన్న శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి ఆలయ ప్రాంగణంలోని కల్యాణ మండపం కొంతమంది రాజకీయ నిరుద్యోగుల్ని పోషించే ధర్మసత్రంగా మారింది. గురువారం ఈ మండపంలో జరిగిన ఓ నిశ్చితార్ధ కార్యక్రమానికి ఆలయ ఈవో శంకరరావు రావటంతో ఈ బండారం బయటపడింది. తామే మండపానికి నిర్వాహకులమంటూ ఒక టీడీపీ నేత రూ.1,500 వసూలు చేసినట్లు నిశ్చితార్థ నిర్వాహకులు ఈవోకు రాతపూర్వకంగా రాసిచ్చారు. అలాగే కల్యాణమండపంలో వివాహాలు నిర్వహిస్తున్న వారి వద్దనుంచి కూడాకొంతమంది రాజకీయ నేతలు వేలకువేలు వసూలు చేస్తున్నారని అల్లూరి ఆదియ్యనాయుడు, అర్జా వెంకటేశ్వరరావు ఈవోకు ఫిర్యాదు చేశారు. ఈ అద్దెలు వసూలు చేసే టీడీపీ నేత వెనుక అధికార కాంగ్రెస్ పార్టీ నేతలున్నారని చెప్పారు. 1999నుంచీ ఈ మండపానికి అద్దెగా వస్తున్న లక్షలాది రూపాయలు దిగమింగుతున్నట్లు ఈవో విచారణలో భక్తులు చెప్పారు. ఉసిరికాయ ఇచ్చి, తాటికాయ లాభం కోరుతున్న నేతలు... దేవునికి పుణ్యం కోసం ఎవరైనా చందాలిస్తారు. కానీ ఇక్కడ దేవుడిపైనే వ్యాపారం చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. దాదాపు రూ.10లక్షలతో నిర్మించిన ఈ కల్యాణ మండపానికి సుమారు రూ.లక్ష చందా ఇచ్చిన కొంతమంది టీడీపీ, కాంగ్రెస్ నేతలు... ఇదే సాకుగా చూపి మండపానికి సంబంధించిన అద్దె డబ్బును 14ఏళ్లగా భక్తులనుంచి గుంజుతున్నారని ఈవో విచారణలో తేలింది . టీడీపీ హయాంలో స్వామివారి ఆలయ ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థాన నిధులతో నిర్మించిన ఈ మండపాన్ని ఇంతవరకూ ఆలయానికి అప్పగించకుండా టీడీపీ, కాంగ్రెస్ నేతలు స్వార్ధబుద్ధితోనే అడ్డుకుంటున్నారని భక్తులు ఆరోపించారు. దళారులు అద్దె వసూలు చేసినట్లు ఒక్క రశీదు ఇచ్చిన దాఖలాలు లేవని విచారణలో తేటతెల్లమైంది. వసూళ్లు నిజమే... ఈవో శంకరరావు విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటివరకూ ఈ మండపాన్ని అద్దెకు ఇవ్వకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలకే వినియోగిస్తున్నామన్నారు. కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు భక్తులకు ఉచితంగా ఇవ్వాలే కానీ... ఇలా వేరేవారు అద్దెకు ఇవ్వటం ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. భక్తులు, బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేస్తే, కొంతమంది రాజకీయనాయకులు అద్దె రూపంలో అక్రమ వసూళ్లు ,ఏస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు.