కల్యాణ మండపం ఏర్పాటుకు కృషి
కల్యాణ మండపం ఏర్పాటుకు కృషి
Published Thu, Aug 18 2016 12:02 AM | Last Updated on Thu, Aug 9 2018 8:15 PM
–ఎంపీ బుట్టారేణుక
ఆదోని: పట్టణంలోని విశ్వబ్రాహ్మణ సమాజానికి కల్యాణ మండపం ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక హామీ ఇచ్చారు. బుధవారం ఆమె స్థానిక షరాఫ్ బజారులోని కాళికాకమఠేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవానికి హాజరయ్యారు. ఉత్సవాల నిర్వాహకులు మేళతాళాలతో ఆమె స్వాగతం పలికారు. ఎంపీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో కొంత స్థలం ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇక్కడ కల్యాణ మండపం నిర్మించాలని విశ్వబ్రాహ్మణ సమాజం పెద్దలు కోరారన్నారు. మండపం నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ నిధులు వెచ్చించవచ్చో లేదో పరిశీలిస్తానన్నారు. పట్టణ ప్రజలు కలిసిమెలిసి ఉత్సవాలు జరుపుకోవడం తనకు ఎంతో సంతోషం కలిగిస్తోందన్నారు. అనంతరం సమాజం మహిళలు బుట్టా రేణుకకు చీర,సారె బహూకరించగా సమాజం పెద్దలు శాలువ కప్పి సత్కరించారు. స్వర్ణకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కరివేణుమాధవ్, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ధనుంజయ ఆచారి, పట్టణ ప్రముఖులు చంద్రకాంత్‌రెడ్డి, రామలింగేశ్వర యాదవ్, సంఘం అధ్యక్ష కార్యదర్శులు శిల్పి గుండాచారి, శ్రీనివాస ఆచారి, ఉపాధ్యక్షుడు మహేష్ ఆచారి, కార్యదర్శి అనిల్ ఆచారి, సంఘం ప్రముఖులు రవికుమార్ ఆచారి, శ్రీకాంత్ ఆచారి, జగదీష్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.
Advertisement