అందుకే మోదీ ఫోటో పెట్టారు: కమల్ రాజ్
న్యూఢిల్లీ : గ్రామీణ పరిశ్రమల సంస్థ(కేవీఐసీ) కొత్త ఏడాది కేలండర్ వివాదంపై విపక్షాలు తప్పుబడుతున్నాయి. మరోవైపు క్యాలండర్తో ఆటు డైరీలపై జాతిపిత మహాత్మాగాంధీ బొమ్మను పక్కనపెట్టి ప్రధాని మోదీ బొమ్మను అచ్చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ప్రధాని మోదీ ఫోటో పెట్టడాన్ని కేంద్రమంత్రి కమల్ రాజ్ మిశ్రా సమర్థించారు.
ఖాదీ వినియోగాన్ని ప్రధాని ప్రోత్సాహిస్తున్నారని, మోదీ ఫోటో పెట్టాలన్నది ఖాదీ బోర్డు నిర్ణయమని ఆయన అన్నారు. విపక్షాలవి అనవసర ఆరోపణలు అంటూ కమల్ రాజ్ కొట్టిపారేశారు. ఖాదీ సంస్థ కేలండర్, డైరీలపై కేవలం మహాత్మాగాంధీ ఫోటో మాత్రమే పెట్టాలన్న నిబంధనేమీ లేదన్నారు.
కాగా కుర్తా, ఓవర్కోటు దుస్తుల్లో ఉన్న మోదీ రాట్నంతో నూలు వడుకుతున్న చిత్రాన్ని ఖాదీ బోర్డు పంచవన్నెలతో ప్రచారంలోకి తెచ్చింది. వీటిలో ఎక్కడా గాంధీ బొమ్మ లేకపోవడం విశేషం. అయితే మోదీ బొమ్మ ముద్రణను కేవీఐసీ చైర్మన్ వినయ్ సమర్థించుకున్నారు.