కాలం కలిసొస్తే 2020లో అమెరికా అధ్యక్షురాలు
‘‘మనల్ని అధ్యక్ష భవనం లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుగా ఓ మందపాటి అద్దం ఉంది. అది దుర్భేద్యమైనది. దాన్ని బద్దలు కొట్టుకుని వెళ్లాలి. వెళ్తారు. మన అమ్మాయిలు కచ్చితంగా వెళ్లి తీరుతారు. ఏదో ఒకరోజు, ఎవరో ఒక అమ్మాయి.. వెళ్లే రోజుకంటే కాస్త ముందుగానే అమెరికా అధ్యక్ష భవనంలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడిదంతా చూస్తున్న అమ్మాయిలు నిరాశ చెందనవసరం లేదు. ప్రతి అవకాశాన్నీ చేజిక్కించుకుని, మీ కలల్ని నిజం చేసుకునే శక్తి మీకుంది’’. (ఓడిపోయాక హిల్లరీ క్లింటన్ ఇచ్చిన కన్సెషన్ స్పీచ్‌లోని ముఖ్యాంశం)
కమలాదేవి హ్యారిస్ (52)
ప్రస్తుతం : కాలిఫోర్నియా అటార్నీ జనరల్
త్వరలో : యు.ఎస్. కాలిఫోర్నియా సెనెటర్
కాలం కలిసొస్తే : 2020లో అమెరికా అధ్యక్షురాలు
క... కమల
కా... కాలిఫోర్నియా!
అమెరికా ఓ బ్రహ్మపదార్థం. లోపల ఏం ఉడుకుతోందో తెలియదు. బయటికి ఏం ఉబుకుతుందో తెలియదు. కానీ ఇప్పుడంతా క్లియర్. కొత్త చెఫ్ డొనాల్డ్ ట్రంప్ తనేం వండబోతున్నదీ ఎన్నికలకు ముందే చెప్పేశారు. తలపై ‘టోక్’ (పొడవాటి వైట్ హ్యాట్) పెట్టుకుని, చేత్తో గరిటె పట్టుకుని అమెరికాను కలియదిప్పడానికి రెడీగా ఉన్నారు. జనవరి 20న వంట మొదలవబోతోంది.
ఒకప్పటిలా అమెరికా ఇప్పుడు ఎవరికీ పరాయి దేశం కాదు. ఎవరి దేశంలో వారికి కొత్తగా వచ్చి చేరిన రాష్టం! అంతగా ట్రంప్ ప్రపంచ దేశాలను ఇన్ ఫ్లుయెన్స్ చేశారు. మనకైతే తెలంగాణ తర్వాత ఆవిర్భవించిన 30వ రాష్ట్రంలా అనిపిస్తోంది అమెరికా! ట్రంప్ కొన్నిసార్లు ‘ఏందిరా బై’ అని కేసీఆర్‌లా, కొన్నిసార్లు ‘ఏం తమాషాగా ఉందా?’ అని చంద్రబాబులా ప్రసంగించారు కాబట్టి అమెరికా అంటే మనకూ కొత్త పోయింది.
అమెరికా ఏం చేయబోతోందో ముందే చెప్పేశారు ట్రంప్. ట్రంప్‌ను ఏం చెయ్యనివ్వబోవడం లేదో ప్రత్యర్థులు కూడా ముందే చేప్పేశారు. కాబట్టి కొత్తగా తెలుసుకోవలసిందేమీ లేదు. మంటెక్కువైతే వంటేదైనా మాడిపోతుంది. అమెరికన్ ప్రజల్లో సగం మంది ట్రంప్ మీద మంటతో ఉన్నారు. ట్రంప్ కిచెన్‌లోంచి వచ్చేవి ఘుమఘుమలైనా, మాడు వాసనలైనా అవి ఆ మంట తీవ్రతని బట్టే ఉంటాయి.
ఇక ఇప్పుడు మనం తెలుసుకోవలసింది ‘వేరు కుంపటి’ గురించి. ఆ కుంపటి ని రాజేయడానికి కావలసినన్ని అగ్గిపుల్లలున్న చెఫ్ గురించి. ఆ కుంపటి కాలిఫోర్నియా. ఆ చెఫ్ కమలా హ్యారిస్. ట్రంప్ గెలిచీ గెలవగానే అమెరికా నుంచి విడిపోతానని కాలిఫోర్నియా మళ్లీ మొదటికొచ్చింది. ఆ రాష్ట్రానికి ట్రంప్ ముఖం నచ్చడం లేదు. రాబడిలో పెద్ద రాష్ట్రం కాలిఫోర్నియా. విడిపోతే ఒక స్వతంత్ర దేశానికి ఉండవలసినంత పవర్ ఉన్న రాష్ట్రం కాలిఫోర్నియా. పెద్ద పెద్ద పరిశ్రమలున్న రాష్ట్రం కాలిఫోర్నియా. ఇన్ని ఉన్నా, అరవై శాతం మంది ప్రజలు ఓటేసినా.. హిల్లరీని గెలిపించుకోలేకపోయింది. ఆ కసి ఉంది కాలిఫోర్నియాలో. ట్రంప్‌ని ఓడించడం సాధ్యం కాలేదు. ఇప్పటికిప్పుడు ట్రంప్‌ను తప్పించుకుని పోవడమూ సాధ్యం కాదు. యు.ఎస్.కాంగ్రెస్‌లో (ఉభయ సభల్లో) ట్రంప్ నిర్ణయాలకు అడుగడుగునా సెగ తగిలించడం ఒక్కటే మార్గం. ట్రంప్ మొదట తీసుకోబోయే చర్య.. డాక్యుమెంట్స్ లేని లక్షలాది మంది విదేశీయుల్ని బలవంతంగా వెనక్కు పంపించడమే కనుకైతే.. దానికి బ్రేక్ వేసేందుకు సెనెట్‌లోని డెమోక్రాట్లు కమలా హ్యారిస్ నాయకత్వంలో ఇప్పటి నుంచే ‘వాద’ రచన చేస్తున్నారు! అదొక్కటే కాదు, ట్రంప్ ఇచ్చిన ‘ఇన్‌హ్యూమన్’ హామీల మీద కూడా కమల సారథ్యంలో దేశంలోని డెమోక్రాట్లు మొత్తం ఏకం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
కమల క్రిమినల్ లాయర్. నేరాన్ని కాకుండా, నేరానికి దారితీసిన పరిస్థితుల్ని చూసి తీర్పులిచ్చే హ్యూమన్ రైట్స్ లాయర్. ఏ శక్తిమంతమైన రాష్ట్రానికి అటార్నీ జనరల్‌గా ఉండి, ఏ శక్తిమంతమైన రాష్ట్రం నుంచి సెనెటర్‌గా కమలా హ్యారిస్ ఎన్నికయ్యారో.. అదే శక్తిమంతమైన రాష్ట్రం నుంచి దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైతే.. హిల్లరీ ‘కన్సెషన్ స్పీచ్’కి ఒక యాక్సెప్టెన్స్ వచ్చినట్లువుతుంది. కమల, కాలిఫోర్నియా.. అమెరికాలో ఇప్పుడు ‘కీ’ వర్డ్స్. కొత్త అమెరికాకు పాస్ వర్డ్స్.
ఎన్నికలకు ముందు ఎన్ని స్పీచ్‌లు, ఎన్ని డిబేట్లు ఉన్నా... ఎన్నికల ఫలితాల తర్వాత అమెరికాలో ప్రధానంగా రెండు స్పీచ్‌లు ఉంటాయి. ఒకటి యాక్సెప్టెన్స్ స్పీచ్. ఇంకొకటి కన్సెషన్ స్పీచ్. గెలిచినవారు యాక్సెప్టెన్స్ స్పీచ్‌ని, ఓడిపోయిన వారు కన్సెషన్ స్పీచ్‌ని ఇస్తారు. ముందు కన్సెషన్ స్పీచ్ ఉంటుంది. తర్వాతే యాక్సెప్టెన్స్ స్పీచ్. ట్రంప్ యాక్సెప్టెన్స్ స్పీచ్ ఇస్తున్నారు. గెలిపించినందుకు థ్యాంక్స్ చెప్పారు. అన్నాళ్ల పాటు గెలుపు వార్తకోసం అమెరికన్ ప్రజలను నిరీక్షణలో ఉంచినందుకు సారీ చెప్పారు. ఆ తర్వాత ‘అందరం కలసి పనిచేద్దాం’ అన్నారు. ఫినిష్. సంప్రదాయం ప్రకారం, ట్రంప్ కన్నా ముందు హిల్లరీ క్లింటన్ కన్సెషన్ స్పీచ్ ఇచ్చారు. స్పీచ్ పూర్తయింది. కానీ ఫినిష్ కాలేదు!
అవును.. ఫినిష్ కాలేదు... మొదలైంది!
అమెరికన్ మహిళల్లో, యువతుల్లో, బాలికల్లో స్ఫూర్తిని రగిల్చిన ఆ కన్సెషన్ స్పీచ్... ఆ అగ్రరాజ్యానికి ఓ మహిళ అధ్యక్షురాలయ్యే వరకూ.. అందుకు ఎన్నేళ్లు పట్టినా... ప్రేరణ ఇస్తూనే ఉంటుంది.
సెనెట్ ఒరలో ఓ డెమెక్రాట్ కత్తి!
కమలా హ్యారిస్ ఆ స్పీచ్‌ని వింటున్నారు. హిల్లరీ ఉద్వేగాన్ని అమె కళ్లారా చూస్తున్నారు. అది ఓడిపోయిన బాధ కాదు. గెలవలేకపోయానన్న ఆవేదనా కాదు. త్వరలోనే, అతి త్వరలోనే.. ‘వియ్ కెన్’ అని దేశమహిళలకు చెప్పడం. హిల్లరీ ఓడిపోయిన రోజే కమల కాలిఫోర్నియా రాష్ట్రం నుంచి అమెరికా సెనెట్‌కు ఎంపికయ్యారు. హిల్లరీలాగే కమల డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి. ట్రంప్‌తో తలపడి హిల్లరీ ఓడిపోతే, సెనెటర్‌గా గెలిచి ట్రంప్‌తో సెనెట్‌లో తలపడబోతున్నారు కమల. అంటే... రిపబ్లికన్ల మెజారిటీ ఉండే సెనెట్ ఒరలో కమల ఓ డెమోక్రాట్ కత్తి!
హిల్లరీ కలకు కమల వారసత్వం?
యు.ఎస్.సెనెట్‌కు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్ మహిళ కమలా హ్యారిస్. అంతేకాదు, అమెరికన్ ఆన్లైన్ పత్రిక ‘హఫింగ్టన్ పోస్ట్’ అంచనా ప్రకారం... కమలా హ్యారిస్‌కు అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి! అది కూడా 2020 ఎన్నికల్లోనేనట! అదే నిజమైతే హిల్లరీ అన్నట్లు కాస్త ముందుగానే అమెరికా అధ్యక్ష పీఠం మహిళల వశం అవుతుంది. రెండు వేల ఇరవై ఎన్నికల్లో ట్రంప్‌ను ఓడించగల 11 మంది డెమోక్రాట్లలో కమల ఒకరు అని ‘మదర్ జోన్స్’ పత్రిక తన తాజా సంచికలో రాసింది.
గుడ్ లుకింగ్.. వెల్ టాలెంటెడ్
కమల కళ్లు ఆకట్టుకునేలా ఉంటాయి. మాట మంత్రంలా ఉంటుంది. ‘ది బెస్ట్ లుకింగ్ అటార్నీ జనరల్ ఆఫ్ ది కంట్రీ’ అని ఓ సందర్భంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆమెకు కాంప్లిమెంట్ ఇచ్చి, ఆ వెంటనే నాలుక కరుచుకుని క్షమాపణ కూడా చెప్పారు. చూడ్డానికి కమల బాగుండే మాట వాస్తవమే కానీ, ఆమెలో చూడవలసిన ప్రతిభా సామర్థ్యాలు చాలా ఉన్నాయి. ఒక అత్యున్నతస్థాయి న్యాయ అధికారిగా అమెరికన్ సమాజంలోని స్థితిగతులన్నింటిపైనా ఆమెకు స్పష్టమైన అవగాహన ఉంది. శాన్ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీగా ఏడేళ్లు, కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా గత ఐదేళ్ల అనుభవం ఆమెను ఉన్నత శ్రేణి న్యాయమూర్తిగా మలిచింది.
వెంటాడుతున్న ‘డొనాల్డ్’ నీడ!
డొనాల్డ్ ట్రంప్ విధానాలతో కమల ఈ నాలుగేళ్లూ సెనేట్‌లో ఫైట్ చేయవలసి ఉంటుంది. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో కనుక ఆమె డెమోక్రాట్ అభ్యర్థిగా ఎన్నికైతే.. అప్పుడూ ట్రంప్తోనో, ట్రంప్ నిలబెట్టిన అభ్యర్థితోనో పోరాడి నెగ్గవలసి ఉంటుంది. ఇవి మాత్రమే కాదు... అటార్నీగా, సెనెటర్‌గా పాలిటిక్స్‌లోకి రాక ముందు కూడా ఆమె ‘డొనాల్డ్’తో తలపడవలసి వచ్చింది. ఆ డోనాల్డ్ ఆమె తండ్రి! డోనాల్డ్ హారిస్. కమల చిన్నప్పుడే భార్యకు విడాకులిచ్చేసి వెళ్లిపోయాడు డోనాల్డ్. ఫలితంగా తలెత్తిన పరిస్థితులను తట్టుకుని నిలబడాల్సి వచ్చింది ఆ కుటుంబం. డోనాల్డ్ జెమైకా సంతతి అమెరికన్. కమల తల్లి శ్యామలా గోపాలన్ హ్యారిస్ ఇండియన్ అమెరికన్. బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సలో స్పెషలిస్ట్. 1960లో డాక్టర్ శ్యామల చెన్నై నుంచి వచ్చి కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. అక్కడే ఆమెకు స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ ఎకనమిక్స్ ప్రొఫెసర్ డొనాల్డ్ హ్యారిస్ పరిచయం అయ్యారు. అక్కడే వాళ్లు పెళ్లి చేసుకున్నారు. అక్కడే ఓక్లాండ్లో కమల, ఆమె చెల్లెలు మాయ పుట్టారు.
వ్యక్తిగతం
కమల ముప్పై ఏళ్ల వయసులో తన కన్నా ముప్పై ఏళ్లు పెద్దవాడైన కాలిఫోర్నియా స్టేట్ అసెంబ్లీ స్పీకర్ విల్లీ బ్రౌన్‌ని ప్రేమించారు. కొద్దికాలం డేటింగ్లో ఉన్నారు. ఆయన శాన్ఫ్రాన్సిస్కో మేయర్ అయ్యాక వీళ్ల రిలేషన్ బ్రేక్ అయింది. రెండేళ్ల క్రితమే 2014 ఆగస్టు 22న కాలిఫోర్నియా అటార్నీ డగ్లాస్ ఎంహాఫ్‌ను పెళ్లి చేసుకున్నారు కమల.
‘న్యాయశాఖలో మనసున్న వ్యక్తి’
కమల తల్లి శ్యామల 2009తో చనిపోయారు. అప్పటికే కమల కాలిఫోర్నియా డిస్రిక్ట్ అటార్నీగా అమెరికాలో పేరున్న న్యాయాధికారి. మాదకద్రవ్యాల నేరస్థులను వారి శిక్షాకాలం పూర్తయ్యేలోగా పట్టభద్రులను, డిప్లొమా హోల్డర్లను చేసి, వారికి బయటి ప్రపంచంలో ఉపాధి కల్పించడం కోసం 2005లో ‘బ్యాక్ ఆన్ ట్రాక్’ ప్రోగ్రామ్‌తో కమల చూపిన చొరవ, తీసుకున్న చర్యలు ఆమెకు ‘అమెరికన్ న్యాయశాఖలో ప్రత్యేకమైన వ్యక్తి’గా గుర్తింపు తెచ్చిపెట్టాయి. కమల లా డిగ్రీ 1989లో పూర్తయింది. తర్వాత తొమ్మిదేళ్లు డిప్యూటీ డిస్రిక్ట్ అటార్నీగా చేశారు. క్రమంగా అటార్నీ జనరల్ స్థాయికి చేరుకున్నారు. ‘లా’లోకి వచ్చే ముందే కమల ఒక నిర్ణయానికి వచ్చేశారు! ‘అమెరికన్ ప్రభుత్వంలో విధాన నిర్ణయాలు తీసుకునే బల్ల చుట్టూ కూర్చొనేవారిలో నేనూ ఒకర్ని అవ్వాలి’ అని బలంగా అనుకున్నారు. చివరికి సాధించారు. త్వరలోనే సెనెట్లోకి అడుగుపెట్టబోతున్నారు.
మరికొన్ని విశేషాలు
కాలిఫోర్నియాలోని తొలి 100 మంది ప్రతిభావంతులైన న్యాయవాదులలో ఒకరిగా ‘లాస్ ఏంజిల్ డైలీ జర్నల్’ కమలా హ్యారిస్‌ను కీర్తించింది. బాలలపై జరిగే లైంగిక అకృత్యాల కేసులకు కమల ప్రాధాన్యం ఇస్తారు. బాధితులకు న్యాయం జరిగేవరకు తన వాదన వినిపిస్తారు. 1980లలో అమెరికా అధ్యక్ష పదవి నామినేషన్‌కు పోటీ పడిన డెమోక్రాట్ అభ్యర్థి జెస్సీ జాక్సన్‌కు కమలా హ్యారిస్ మద్దతు ఇచ్చారు. తన కారు మీద ‘జెస్సీ జాక్సన్ ఫర్ ప్రెసిడెంట్’ అనే బంపర్ స్టిక్కర్‌ను అంటించుకుని మరీ ఆమె ప్రచారం చేశారు. ఇది ఆమె అంకితభావానికి చిన్న నిదర్శనం.
ఉరిశిక్షలకు వ్యతిరేకం
కమలా హ్యారిస్ డిస్ట్రిక్ట్ అటార్నీగా ఉన్నప్పుడే 2004 ఏప్రిల్‌లో ఒక సంఘటన జరిగింది. శాన్ఫ్రాన్సిస్కో పోలీస్ డిపార్ట్మెంట్ అధికారి ఐజక్ ఎస్పినోజా డ్యూటీలో ఉండగా దుండగుడెవరో అతడిని తుపాకీతో కాల్చి చంపాడు. వెంటనే ఆ దుండగుడిని పట్టుకున్నారు. కేసు విచారణ కమల దగ్గరకు వచ్చింది. కమల తీర్పు ఇచ్చారు. అయితే ఆ తీర్పు పోలీసు అధికారుల అసోసియేషన్ ఆశించినట్టుగా ఉరిశిక్ష కాదు. యవజ్జీవ కారాగార వాసం. అంతా కమలపై మండి పడ్డారు. కమల నిర్ణయాన్ని తప్పుబట్టారు. అంత్యక్రియలకు ముందు ఐజక్ ఎస్పినోజా మృతదేహాన్ని సెయింట్ మేరీస్ కెథడ్రాల్కు తెచ్చినప్పుడు కమల అక్కడే ఉన్నారు. అప్పటి యు.ఎస్.సెనెటర్, శాన్ఫ్రాన్సిస్కో మాజీ మహిళా మేయర్ డయాన్ ఫైన్స్టైన్ ఆమెను చూసి, పరుగున పుల్పిట్ (చర్చి వేదిక) మీదకు వెళ్లి, అక్కడి నుంచి కమలను ఉద్దేశిస్తూ, ఎస్పినోజాను చంపిన వాడికి ఉరిశిక్ష విధించాల్సిందే అని పెద్ద అరుపుతో డిమాండ్ చేశారు. అప్పటికే అక్కడికి చేరుకుని ఉన్న దాదాపు రెండు వేల మంది పోలీసు అధికారులు ఆమెతో గొంతు కలిపారు. కమలా హ్యారిస్ మీద తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. కానీ కమల ఉరిశిక్షను బహిరంగంగానే నిరాకరించారు. దటీస్ కమలా హ్యారిస్.
వేటికి అనుకూలం? వేటికి వ్యతిరేకం?
► తుపాకీ నియంత్రణ అనుకూలం
► బ్యాంకు రుణగ్రస్తుల ఇళ్ల స్వాధీనం వ్యతిరేకం
► ఉరిశిక్ష విధింపు, అమలు వ్యతిరేకం
► విద్వేషపూరిత నేరాలు వ్యతిరేకం
►పౌరహక్కుల ఉల్లంఘన వ్యతిరేకం
► లెస్బియన్లపై వివక్ష వ్యతిరేకం
► అబార్షన్లు అనుకూలం
► ప్రాథమిక విద్యా సంస్కరణలు అనుకూలం
► పర్యావరణ విధ్వంసం వ్యతిరేకం
► ఆర్థిక నేరాలు వ్యతిరేకం
మాధవ్ శింగరాజు