నీతి తప్పిన మనిషి రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాడు
నీతి తప్పిన మనిషి రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాడు. పొట్ట కూటి కోసం కిరాణా కొట్టును నడుపుకొనే అభాగ్యుల పాలిట మృత్యువుగా మారాడు. ద్విచక్ర వాహనంలో పెట్రోల్ పోసుకుని తీరా డబ్బులు ఇవ్వకుండా పరారయ్యాడు. పైసలు ఇవ్వకుండా పారిపోవడంతో ఆ దుండగుడిని వెంటాడిన తండ్రీ కొడుకులను విధి బలి తీసుకుంది. ఎదురుగా వచ్చిన టిప్పర్ వీరి బైకును ఢీకొనడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఇద్దరి ఉసురుపోసుకున్న ఆ ఆగంతకుడి చర్యపై స్థానికంగా ఆగ్రహం వ్యక్తమైంది.
అన్నెంపున్నెం ఎరుగని ఆ తండ్రీకొడుకులు విగతజీవులైన దృశ్యాన్ని చూసి ప్రతి ఒక్కరూ అయ్యో పాపం అనకుండా ఉండలేకపోయారు. ఈ హృదయ విదారక ఉదంతం బుధవారం మంచాల మండలంలోని ఆగాపల్లి సమీపంలో చోటుచేసుకుంది. కిరాణ దుకాణంలో పెట్రోల్ పోయించుకున్న ఓ వ్యక్తి డబ్బులివ్వకుండా పరారయ్యాడు. అతడిని బైక్‌పై వెంబడించిన తండ్రీకొడుకులను టిప్పర్ ఢీకొట్టడంతో మృత్యువాత పడ్డారు.
ఈ విషాదకర ఘటన మండలంలోని ఆగాపల్లి సమీపంలో బుధవారం సాయత్రం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగాపల్లికి చెందిన కంభాలపల్లి దశరథ(55) గ్రామంలో హైదరాబాద్- నాగార్జునసాగర్ రహదారిపై చిన్న కిరాణా కొట్టు నిర్వహిస్తున్నాడు. ఈయనకు భార్యాపిల్లలు ఉన్నారు. పెద్ద కుమారుడు కృష్ణ(27) నగరంలోని ముషీరాబాద్-1 డిపోలో డ్రైవర్. బుధవారం కృష్ణ ఇంటివద్ద ఉన్నాడు.
సాయంత్రం 4:10 గంటల సమయంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి దశరథ కిరాణ కొట్టులో పెట్రోల్ పోయించుకొని డబ్బులు ఇవ్వకుండా చిన్నతుండ్ల గ్రామం వైపు పరారయ్యాడు. దీంతో దశరథ తన కొడుకు కృష్ణకు ఫోన్‌చేసి విషయం చెప్పాడు. కృష్ణ ఇంటినుంచి బైక్‌తో వచ్చి తండ్రిని ఎక్కించుకొని దుండగుడు పరారైన చిన్నతుండ్ల గ్రామం వైపు బయలుదేరాడు. ఈ క్రమంలో ఆగాపల్లి శివారులోని జాద్మియా బావి సమీపంలోని మలుపులో ఎదురుగా వస్తున్న టిప్పర్ (ఏపీ21టీయూ2243) వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దశరథ, కృష్ణ తలలకు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ఆస్పత్రికి తరలించారు. దశరథకు భార్య రాములమ్మ, కుమారుడు కృష్ణతోపాటు నాగభూషణ్, రమేష్, రాజేష్ ఉన్నారు. కృష్ణకు భార్య స్వప్న ఉంది.
ఇద్దరూ సచ్చిపోతిరి..
దశరథ, కృష్ణల మృతితో మంచాల మండలంలోని ఆగాపల్లిలో విషాదం అలుముకుంది. ఘటనా స్థలం మృతుల కుటుంబీకులు, బంధువుల రోదనలతో మిన్నంటింది. భర్త, కుమారుడి మృతితో రాములమ్మ కన్నీటిపర్యంతమయ్యారు. ‘కొడుకా..కృష్ణ.. ఆర్నెళ్ల కింద నీ కొలువు పర్మినెంట్ అయింది బిడ్యా.. మంచిగ బతుకుతవ్ అనుకున్న.. అంతలోనే మీ నాయినను.. నిన్ను.. ఆ దేవుడు తీసుకపోయ్యిండు బిడ్యా.. ఇద్దరూ సచ్చిపోతిరి.. మేమెవరి కోసం బతకాలి.. ఎట్ల బతకాలి.. అయ్యా.. ’ అని రాములమ్మ రోదించిన తీరు హృదయ విదారకం. తండ్రి ఫోన్ చేయడంతో ‘ఇప్పుడే.. వస్తాను’ అని కృష్ణ భార్య స్వప్నకు చెప్పి బైక్‌పై వెళ్లాడు.
భర్త కోసం ఎదురుచూస్తున్న ఆమెకు 20 నిమిషాల వ్యవధిలోనే ఆయన మృతిచెందాడనే సమాచారం తెలియడంతో కుప్పకూలిపోయింది. ‘నేనెట్ల బతకాలయ్యా.. నీ డ్యూటి పర్మినెంట్ అయింది.. మంచిగా బతుకుదమనుకున్నం.. అంతలోనే ఆ దేవుడు నిన్ను నాకు కాకుండా తీసుకపోయిండు కదయ్యా..’ అని స్వప్న గుండెలుబాదుకుంటూ రోదించింది.