కార్టూనిస్టు శేఖర్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ కార్టూనిస్టు కంబాలపల్లి శేఖర్ (49) అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన శేఖర్ విద్యార్థి దశ నుంచే కార్టూన్లు గీసేవారు. 1989లో పాత్రికేయ రంగంలో వెలుగులోకి వచ్చిన ఆయన.. ప్రజాశక్తి, ఆంధ్రప్రభల్లో కార్టూనిస్టుగా పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి దినపత్రికలో పనిచేస్తున్న శేఖర్.. కొంతకాలంగా జీర్ణకోశ సంబంధ కేన్సర్‌తో బాధపడుతున్నారు. రెండు నెలలుగా ఇంట్లోనే ఉంటూ వైద్యం చేయించుకుంటున్నారు. ఆదివారం రాత్రి ఆయన పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చగా... చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. శేఖర్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కార్టూన్లలో తనదైన బాణి కలిగి, సామాజిక స్పృహను ప్రతిబింబించే కార్టూన్లు వేసిన శేఖర్ మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటని పలువురు ప్రముఖులు, జర్నలిస్టు సంఘాల నేతలు పేర్కొన్నారు.