రూ.500 నాణెం సేకరణ
అమలాపురం టౌన్ :
కోల్కత్తా టంకశాల దేశంలో తొలసారిగా విడుదల చేసిన రూ.500 నాణేన్ని అమలాపురం భూపయ్య అగ్రహారానికి చెందిన నాణేల సేకరణ కర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ సేకరించారు. 2015 అక్టోబర్ 26 నుంచి 29వ తేదీ వరకూ న్యూఢిల్లీలో జరిగిన మూడో భారత్ – ఆఫ్రికా శిఖరాగ్ర సదస్సు సందర్భంగా కోల్కత్తా టంకశాల ఈ నాణేన్ని విడుదల చేసిందని కృష్ణ కామేశ్వర్ తెలిపారు. 35 గ్రాముల బరువున్న ఈ నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, చెరో ఐదు శాతం నికెల్, జింక్ ఉపయోగించి తయారు చేశారు. ఇదే సదస్సును పురస్కరించుకుని భారతీయ తపాలా శాఖ విడుదల చేసిన ఆరు ఉబ్బెత్తు చిత్రాల ముద్రణతో ఉన్న తపాలా బిళ్లల మినియేచర్ను కూడా కృష్ణ కామేశ్వర్ సేకరించారు.