‘అర్ధరాత్రి’పై ఆంక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పడంతోపాటు కొత్త ఏడాదిని ఘనంగా ఆహ్వానించేందుకు నగరవాసులు ఎన్నో ప్రణాళికలు రూపొందిం చుకుంటున్నారు. వేడుకల కోసం ఇప్పటికే నగరంలోని పలు హోటళ్లలో, రెస్టారెంట్లలో ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అయితే వేడుకల పేరిట అర్ధరాత్రి దాటిన తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు ముందస్తుగానే దృష్టి సారించారు. దీనిలో భాగంగా డిసెంబర్ 31 రాత్రి ప్రత్యేక నిబంధనలు అమలులోకి తేనున్నారు.
ఢిల్లీలోని రద్దీ ప్రదేశాల్లో ఒకటైన కన్నాట్‌ప్లేస్‌లో 31 వేడుకల కారణంగా ఎలాంటి ఘర్షణలు, మహిళలపై వేధింపుల వంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. కన్నాట్‌ప్లేస్(సీపీ)లో దాదాపు 50 వరకు రెస్టారెంట్లు, హోటళ్లు ఉన్నాయి. ప్రతి హోటల్, రెస్టారెంట్ వద్ద ఒక పోలీస్‌ను అందుబాటులో ఉంచేలా పోలీసులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సీపీలో ఆ రాత్రి వాహనాల రాకపోకలపైనా ఆంక్షలు విధించనున్నారు. రాత్రి 12.30 గంటల తర్వాత మ్యూజిక్ పూర్తిగా బంద్ చేయాలి. రాత్రి 12.55 గంటల తర్వాత హోటల్లో భోజన విక్రయాలు పూర్తిగా నిలిపివేయాల్సి ఉంటుంది.
కన్నాట్‌ప్లేస్ ఔటర్ సర్కిల్లో వాహనాల పార్కింగ్‌కు అనుమతిస్తారు. ఢిల్లీలోని అన్ని పోలీస్స్టేషన్లలో ఎస్హెచ్ఓ నుంచి డీసీపీ స్థాయి వరకు అధికారులు రాత్రి 8 గంటల నుంచి రాత్రి ఒంటిగంట వరకు ఏరియా పెట్రోలింగ్ నిర్వహించాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్.బస్సీ,స్పెషల్ కమిషనర్(శాంతిభద్రతలు) దీపక్‌మిశ్రా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అన్ని ప్రాంతాల్లో పీసీఆర్ సిబ్బంది సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వీలైనంత ఎక్కువ మంది పోలీసులను రోడ్లపై వాహనాల తనిఖీలకు వినియోగించనున్నారు. మద్యం సేవించి మహిళలను వేధించే వారిపై దృష్టి సారించనున్నట్టు పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. రానున్న వారం రోజుల పాటు నగరంలో రాత్రి పూట గస్త్తీని కూడా పెంచుతామన్నారు. ఇందుకోసం ప్రస్తుతమున్న గస్తీ సిబ్బందితో పాటు 15 వేల రిజర్వ్ సిబ్బందిని కూడా రాత్రివేళ గస్తీ విధుల కోసం వీధులలో మోహరిస్తామని తెలిపారు. జనవరి మొదటివారం వరకు నగరంలో రాత్రి పూట గస్తీపై మరింత శ్రద్ధ వహించనున్నామని వెల్లడించారు.