అర్ధరాత్రి లైంగికంగా వేధించారు: నటి కాంచన
సాక్షి, కోల్‌కతా: బెంగాలీ నటి కాంచనా మొయిత్రా మంగళవారం రాత్రి కోల్‌కతాలో భయానక అనుభవాన్ని ఎదుర్కొంది. షూటింగ్ పూర్తిచేసుకొని ఆమె తన వాహనంలో ఇంటికి వెళుతుండగా.. తాగుబోతులు ఆమె వాహనాన్ని ఆపి.. లైంగికంగా వేధించారు. తాగిన మైకంలో ఉన్న ముగ్గురు యువకులు తనపై దాడి చేశారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో సిరితీ క్రాసింగ్ వద్ద ఈ ఘటన జరిగింది. షూటింగ్ ముగించుకొని అర్ధరాత్రి సమయంలో ఇంటికి తిరిగి వెళుతుండగా.. ఇద్దరు వ్యక్తులు తమ కారును ఆపారని, కారు వాహనాన్ని తమ మీద నుంచి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడని ఆరోపిస్తూ.. డ్రైవర్‌పై దాడి చేసి కారు కీస్ లాక్కొన్నారని ఆమె తెలిపింది. అనంతరం తనను కారు నుంచి బయటకు లాగి.. అసభ్యంగా తాకారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ వ్యవహారంలో మొత్తం ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నారని తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి బెహలా పోలీస్ స్టేషన్లో కేసు నమోదవ్వగా..ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేశారు.
తనకు ఎదురైన భయానక ఘటన గురించి నటి కాంచన 'టెలిగ్రాఫ్' పత్రికకు వివరించింది. తమను కారు నుంచి దింపి.. కీస్ లాక్కున్న తాగుబోతులు.. ఎంత ప్రాథేయపడినా వినలేదని తెలిపింది. 'నేను డ్రైవర్‌ను 20సార్లు చెంపదెబ్బలు కొట్టాలని, ఆ తర్వాత నన్ను డ్రైవర్ 20సార్లు చెంపదెబ్బలు కొట్టాలని.. అప్పుడే కీస్ ఇస్తామని వేధించారు. 40సార్లు సిట్-అప్లు చేయాలని నన్ను బెదిరించారు' అని ఆమె తెలిపింది.