నమస్కార వైభవం
• ధర్మసోపానాలు
మన సంప్రదాయంలో నమస్కార వైభవం అని ఒకమాట ఉంది. ఒకరికొకరు నమస్కరించు కుంటారు. నమస్కారం చేయడానికి వినయం ఉండాలి. ఒకరి దగ్గరకు వెళ్ళి నేలమీదపడి నమస్కరించారనుకోండి. నేలమీద పడిపోయినవాడిదికాదు బాధ్యత, ఎవడు నిలబడి ఉన్నాడో వాడిది కర్తవ్యం. వాడు వచ్చి నేలమీద ఎందుకుపడిపోయాడు? ‘‘అయ్యా! ఎంత కింద పడిపోవాలో అంత కిందపడిపోయాను. ఇంకా పడిపోవడానికి అవకాశంలేదు. ఇప్పుడు నన్ను పైకెత్తగలిగిన వారెవరు? పడకుండా నిలబడిన మీరే. అందుకని మీరే ఎత్తాలి’’ అన్నది పడిపోయినవాడి భావన. అందువల్ల ఎవడో వచ్చి కాళ్ళమీద పడి నమస్కారం చేస్తే, పొంగిపోనక్కరలేదు. ఉలిక్కిపడాలి... ‘‘బాబోయ్! నాకు ఇప్పుడు కొత్త కర్తవ్యం అంటుకుంది’’అని. వంగి రెండు భుజాలు పట్టి పైకెత్తుతాడు. అంటే... ‘‘నిన్ను నిలబెట్టే కర్తవ్యం నేను పుచ్చుకుంటున్నాను. నీవు పతితుడవు కాకుండా నేను దిద్దుతాను... లే...’’ అని ఆయన అభయం ఇస్తాడు.
నమస్కారం అంత తేలికయిందేమీ కాదు... పడిపోయానని అంగీకరించడానికి వినయం ఉండాలి, అహంకార పరిత్యాగం ఉండాలి. నమస్కారం చేసేటప్పుడు ఎవరు పెద్దలో వారికి నమస్కరించాలి. వారిలో కూడా ప్రాధాన్యత – జ్ఞానంలో పెద్దవారికి.
లోకమంతా సన్యాసికి నమస్కరిస్తే, సన్యాసి మాత్రం ఎక్కువ చాతుర్మాస్యదీక్షలుచేసిన సన్యాసికి నమస్కరిస్తాడు. అందుకే కంచి పీఠాధిపతిగా శ్రీ చంద్రశేఖరేంద్ర స్వామి వారున్నప్పుడు ఆయన చేత నమస్కారం అందుకోదగిన వ్యక్తి ఈ లోకంలో లేడు. కారణం–అయన 13వ ఏట సన్యసించి, నూరేళ్ళు జీవించడంతో 83 చాతుర్మాస్య దీక్షలు చేయగలిగారు. అప్పటికి అన్ని చేసిన వాళ్ళులేరు. అది అపూర్వం. మహాస్వామి ఒక మాటంటుండేవారు. ‘‘నేను కలియుగంలో పుట్టినందుకు సంతోషిస్తున్నా. త్రేతాయుగంలో పుట్టనందుకు ఆనందపడుతున్నా. ఎందుకంటే త్రేతాయుగంలో పుట్టి ఇలా సన్యాసాశ్రమంలో ఉండి ఉంటే రాముడికి నమస్కారం చేసుకునే అవకాశం నాకు లేకుండాపోయేది. కలియుగం కాబట్టి ఆయనకు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోగలుగుతున్నా’’...అనేవారు. అంతటి వినయశీలి. ఎక్కడ జ్ఞానముంటుందో అక్కడ వినయముంటుంది.
కంచి మహాస్వామి వారి తల్లిగారిపేరు మహాలక్ష్మమ్మ. స్వామివారికి ఒక అలవాటు ఉండేది. వారు ప్రతిరోజూ ఎక్కడ ఉన్నా సరే, కలవైవంక తిరిగి నమస్కారం చేసేవారు. కలవై వారి గురుస్థానం. వారు శతాయుష్కులైన తర్వాత ఒకరోజు పక్కన పరిచారకలు కూడా లేరు. జయవిజయులు చెన్నై వెడుతూ అక్కడ వేదపాఠశాలలో పెట్టడానికి మహాలక్ష్మమ్మగారి చిత్తరువు తీసుకెడుతున్నారు. మహాస్వామివారు ఆ పటాన్ని చేతుల్లోకి తీసుకుని తదేకంగా చూసారు.
అప్పటికే వారు మౌనదీక్షలో ఉన్నారు. ఆదేపనిగా చూస్తూ ఆమ్మ రెండుపాదాలు (పటంమీద)చేతులతో తడుముతూ తన తలమీద పెట్టుకున్నారు. పటం తిరిగి ఇచ్చి లేచి నిలబడి కలవైవంక తిరిగి గురువుగారికి నమస్కారం చేసారు. అవే వారు చేసిన ఆఖరి నమస్కారాలు. వాళ్ళిద్దరికీ నమస్కారం చేసుకుని శరీరం విడిచిపెట్టేసారు. బ్రహ్మీభూతులయ్యారు. అంటే మహాస్వామి అంతటివారు తల్లి విషయంలో అంత అనుగ్రహాన్ని చూపించారు.