తొమ్మిది మంది రైతుల ఆత్మహత్య
అప్పుల బాధలే కారణం
సాక్షి నెట్వర్క్: తెలంగాణ జిల్లాల్లో అప్పుల బాధ తాళలేక వేర్వేరుగా తొమ్మిది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం అర్నరకొండకు చెందిన రైతు పిల్లలమర్రి జగన్(43) తనకున్న ఏడు ఎకరాలోల పత్తి, వరి సాగు చేయగా, వరుస నష్టాలు వచ్చాయి. దీంతో రూ. 9 లక్షల వరకు అప్పులు అయ్యాయి. మనస్తాపం చెంది ఈ నెల 1న క్రిమిసంహారక మందు తాగాడు. ఆస్పత్రిలో శనివారం మృతి చెందాడు. మహాముత్తారం మండలం నిమ్మగూడెంకు చెందిన కండెల రాజమౌళి(55) పత్తి సాగు చేయగా, నష్టపోయాడు. రూ. 5 లక్షల అప్పులయ్యాయి. మనస్తాపం చెందిన శనివారం క్రిమిసంహారక మందు తాగాడు.
ఆస్పత్రికి తరలిస్తుండగా, చనిపోయాడు. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేటకు చెందిన పొచన్నగారి దుర్గ రాములు (26) తండ్రితో పాటు వ్యవసాయం చేస్తున్నాడు. రెండేళ్లుగా వర్షాలు లేక పంట దెబ్బతింది. రూ. 2 లక్షల వరకు అప్పు చేశారు. అప్పు తీరే మార్గం కనిపించక శుక్రవారం రాత్రి ఉరి వేసుకున్నాడు. వరంగల్ జిల్లా ములుగు మండలం దేవగిరిపట్నంకు చెందిన రైతు తేజావత్ స్వామి(50)కు గతేడాది వర్షాభావ పరిస్థితుల్లో ఆశించిన మేర దిగుబడి రాలేదు. దీంతో అప్పులు పెరిగాయి.
ఈ ఏడాది కూడా పంట పోవడంతో.. పంటను కాపాడుకునేందుకు బ్యాంకుకు రుణం కోసం వెళ్లి ప్రయత్నించగా, ఆలస్యమవుతుందని చెప్పారు. దీంతో ఈ నెల 1న క్రిమిసంహార మందు తాగాడు. ఎంజీఎంలో శనివారం చనిపోయాడు. నల్లగొండ జిల్లా రాజాపేట మండలం నెమిలకు చెందిన కొత్త ఉప్పల్రెడ్డి(48) నాలుగు బోర్లు వేయించగా, నీరు పడలేదు. ఈ ఏడాది తన మూడు ఎకరాల్లో పత్తి వేశాడు. పెట్టుబడులు, కుటుంబ అవసరాల కోసం రూ. 10 లక్షల వరకు అప్పు చేశాడు. పంట ఆశాజనకంగా లేకపోవడంతో మనస్తాపం చెంది శుక్రవారం రాత్రి క్రిమిసంహారక మందు తాగాడు.
ఇదే జిల్లా చిట్యాల మండలం ఏవూరుకు చెందిన కొండె యాదయ్య(60) తన ఐదు ఎకరాల్లో పత్తి వేశాడు. మూడో కుమారుడు మతిస్థిమితం కోల్పోయాడు. పెట్టుబడులు, కొడుకు చికిత్స కోసం రూ. 7 లక్షల వరకు అప్పు చేశాడు. పంట వచ్చే పరిస్థితి లేకపోవడంతో మనస్తాపం చెంది శుక్రవారం రాత్రి క్రిమిసంహారక మందు తాగాడు. నల్లగొండ జిల్లా నిడమనూర్ మండలం ఊట్కూర్కు చెందిన మారగోని కోటమ్మ(25) భర్త సైదయ్యతో కలిసి సాగు చేస్తోంది. పెట్టుబడుల కోసం అప్పు చేశారు. పంట పోవడంతో మనస్తాపం చెంది శనివారం ఉదయం క్రిమిసంహారక మందు తాగింది.
రంగారెడ్డి జిల్లా ధాదూరు మండలం నాగసముద్రంకు చెందిన అంజిలప్ప(45) తనకున్న ఎకరం 13 గుంటలను అమ్మి కూతురి వివాహం చేశాడు. నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి వేశాడు. వర్షాభావ పరిస్థితుల్లో పంట ఎండిపోయింది. రూ. 2.65 లక్షల అప్పు ఉంది. అప్పు తీరే మార్గం కనిపించక శుక్రవారం సాయంత్రం ఒంటికి నిప్పంటిచుకున్నాడు. హైదరాబాద్ తరలిస్తుండగా చనిపోయాడు. ఇదే జిల్లా షాబాద్ మండలం ఎల్గొండగూడకు చెందిన కుమ్మరి యాదయ్య(35)కు వర్షాభావ పరిస్థితుల్లో పంట చేతికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో పెట్టుబడులు, కుటుంబ అవసరాల కోసం చేసిన రూ. 3 లక్షల అప్పు తీరే మార్గం కనిపించక శుక్రవారం రాత్రి ఉరి వేసుకున్నాడు.
గుండెపోటుతో ముగ్గురు మృతి
కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం గొల్లపల్లిలో వంకాయల పెద్దశంకర్(42) తనకున్న భూమిలో వరి పంట సాగు చేస్తున్నాడు. రూ.3లక్షల అప్పు చేశాడు. కుమారుడు నవీన్ అనారోగ్యానికి గురికావడంతో మరో రెండు లక్షలు అప్పు చేశాడు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో శంకర్ శనివారం వేకువజామున గుండెపోటుకు గురై మృతి చెందాడు. వరంగల్ జిల్లా జిల్లా పర్వతగిరి మండలం కొంకపాకు చెందిన మహిళా రైతు సూర్ల గట్టమ్మ(47) తనకున్న పొలంలో మిర్చి, పత్తి వేసింది. పత్తి చేతికి వచ్చే సమయంలో వర్షాల వల్ల దెబ్బతింది.
రూ. 2 లక్షల మేరకు అప్పుల కాగా, మనోవేదనకు గురై శనివారం గుండెపోటుకు గురైంది. నల్లగొండ జిల్లా గుండాల మండలం పల్లెపహాడ్కు చెందిన ముత్తినేని ప్రభాకర్(63) 8 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. 6 లక్షల వరకు అప్పు చేశాడు. వర్షాలు రాకపోవడంతో మనస్తాపం చెంది శనివారం ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇరుగు పొరుగు వారు నిలువరించగా, కొద్దిసేపటికే గుండెపోటుతో మరణించాడు.