కలకలం రేపిన మహిళా కండక్టర్
జంగారెడ్డిగూడెం : స్థానిక ఆర్టీసీ డిపోలో కండక్టర్గా పనిచేస్తున్న కంకిపాటి వాణిశ్రీ తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో ఆదివారం రాత్రి బస్టాండ్లో కలకలం రేగింది. డిపోలో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు వేధిస్తున్నారని, మనస్తాపంతో బస్టాండ్లో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె గణపవరంలో ఏఎస్సైగా పనిచేస్తున్న సోదరుడు రవికి, జంగారెడ్డిగూడెం పామాయిల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న జి.వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో వారు ఆమె కాపాడాలని స్థానిక పాత్రికేయులకు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్సై కె.శ్రీహరిరావు, ఏఎస్సై రామచంద్రరావు, సిబ్బంది అక్కడకు చేరుకుని వాణిశ్రీని వారించారు.
ఆమె నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాను గతంలో నేషనల్ మజ్దూర్ యూనియన్లో ఉన్నానని, ఇటీవల తాను యూనియన్ మారానని చెప్పారు. యూనియన్ మారడంతో అప్పటి నుంచి డిపోలో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు తనను వేధిస్తున్నారని, అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మనస్తాపానికి గురై అత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అక్కడకు చేరుకున్న ఆమె భర్త వెంకటేశ్వరరావు వాణిశ్రీని అనునయించి ఇంటికి తీసుకెళ్లారు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి విచారణ చేస్తామని ఎస్సై కె.శ్రీహరి వాణిశ్రీని కోరారు.