ఎవరి స్పేస్ వారికి ఉండాలి
పెళ్లి తర్వాత ఆడపిల్ల జీవితం మారిపోతుందంటారు. అది నిజమే కావచ్చు. కొత్త పరిసరా లు, కొత్తమనుషులు, కొత్త మనస్తత్వాల మధ్య మెలగడం, సర్దుకుపోవడం, అనుబంధాలను అల్లుకుపోవడం అంత సులభం కాదు. అందుకే ఆ మార్పు కాస్త కొత్తగాను, ఇంకాస్త కన్ఫ్యూజింగ్గాను ఉంటుంది. నేను కూడా ఆ మార్పు గురించి ఆలోచించా ను. పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంటుందో ఏమో అనుకున్నా ను. కానీ నా అదృష్టం... అంతా ఎప్పటిలానే ఉంది. చెప్పాలం టే... ఇంకాస్త అందంగా, ఆనందంగా ఉంది.
నా భర్త సైఫ్, నేను ఒకలాగే ఆలోచిస్తాం, ఒకేలా నడచుకుంటాం, అందుకే హ్యాపీగా ఉంటాం... లాంటి మాటలు నేను చెప్పను. మా ఇద్దరి వ్యక్తిత్వాలు వేరు. అభిప్రాయాలు కూడా కొన్ని విషయాల్లో వేరు. అయినా హ్యాపీగా ఉన్నామంటే కారణం... అర్థం చేసుకోవడం, అడ్జస్ట్ అయ్యేందుకు ప్రయత్నించడం. నా వరకూ నేను నచ్చనిదాన్ని ముఖం మీద చెప్పేస్తాను. అతడు కోపం తెచ్చుకోడు. ఇంకోసారి అలా చేయకుండా ఉంటానికి ట్రై చేస్తాడు. తను కూడా అన్నీ నాతో షేర్ చేసుకుంటాడు. నేను నా అభిప్రాయాన్ని చెబుతాను. నిర్ణయాన్ని మాత్రం తనకే వదిలేస్తారు. అంతకుమించి జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించను.
ఎవరి స్పేస్ వారికి ఇస్తే... అపార్థాలకు తావుండదు. ఎప్పుడైతే అవతలివాళ్లు మన కోసం పూర్తిగా మారిపోవాలని, మనకు నచ్చినట్టు మాత్రమే ఉండాలని కోరుకుంటామో... అప్పుడే అభిప్రాయభేదాలు, అలకలు, అనవసరమైన గొడవలు మొదలవుతాయి. ఫలితం... ఇద్దరి మధ్య దూరం. ఆ గ్యాప్ రాకూడదంటే స్పేస్ ఇచ్చుకోవాలి. మా ప్రేమబంధం పదిలంగా ఉండేందుకు నేను ఎంచుకున్న మార్గం... నా భర్త కోరుకునే స్పేస్ తనకి ఇవ్వడం. అందరూ అలాగే ఉండాలి, నాలాగే చేయాలి అని చెప్పను కానీ... అలా చేయడం వల్ల మంచి జరుగుతుందని మాత్రం కచ్చితంగా చెప్పగలను!