ఇక నుంచి కోడి, మేక మాంసమే దిక్కు!
కాన్పూర్: ఉత్తరప్రదేశ్లో కబేళాలు మూతపడటంతో కాన్పూర్లోని జూలో పలు జంతువులకు చిక్కు వచ్చిపడింది. నిన్నమొన్నటి దాకా అవి గేదెమాంసాన్ని ఆరగించేవి. కాన్పూర్లో కబేళాల మూసివేత ఫలితంగా గేదె, దున్నపోతు మాంసం దొరక్కపోవడంతో జూ అధికారులు మేక, కోడి మాంసాన్ని వడ్డిస్తున్నారు. కోడి, మేక మాంసాలను క్రూరమృగాలు ఇష్టపడటం లేదట. బీజేపీ ఇచ్చిన ఎన్నికల హామీలో భాగంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలోని అక్రమ, అనుమతుల్లేని కబేళాలను మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అక్కడ మాంసానికి కొరత ఏర్పడింది.
కాన్పూర్ జూలో మగ సింహం అజయ్, ఆడసింహం నందినితోపాటు మాంసాహారం తినే జంతువులు 70 ఉన్నాయి. మగ మాంసాహార జంతువులు రోజుకి 12 కేజీల మాంసాన్ని, ఆడ జంతువులు 10 కేజీల మాంసాన్ని తింటాయి. రోజు 150 కేజీల దున్నపోతు మాంసాన్ని జూ కొనుగోలు చేస్తుంది. జూలోని కొన్ని జంతువులకు కోడి మాంసాన్ని ఆహారంగా పెడితే తినేందుకు ఆసక్తి చూపడం లేదని, కొన్ని అయితే దానిని ముట్టుకోవడమే లేదని అధికారులు చెబుతున్నారు.