నా ప్రయాణం అప్పుడే మొదలైంది...
నాకు అక్షరాభ్యాసం చేసింది కాంతారావు మాస్టార్. ఇక ప్రాధమిక పాఠశాలలో నన్ను ప్రభావితం చేసిన గురువులు చాలామందే ఉన్నారు. ముఖ్యంగా నేను అన్నయ్యా అని ఆత్మీయంగా పిల్చుకున్న మా భద్రగిరి మాస్టార్ గురించి చెప్పాలి. ఆయన బోధనా విధానం బాగుండేది. ఇంకా ప్రాధమిక పాఠశాల దశలో నన్ను ప్రభావితం చేసిన గురువుల్లో ఇమామ్, మదీనా, సుబాని, మా హెడ్మాస్టర్ రాజు ఉన్నారు. నేను బాగా చదివే విద్యార్థిని కాబట్టి... గురువులందరూ నాతో బాగుండేవాళ్లు.
ఇక, ఉన్నత పాఠశాలకు వచ్చేసరికి చంద్రశేఖర్రెడ్డి మాస్టర్, కోటయ్యగారు, వరప్రసాద్ మాస్టర్, జేఎల్ఎన్ మూర్తిగారు, నరసింహారావుగారు.. నా ఆత్మీయ గురువులు. వీళ్లలో మూర్తిగారు లెక్కల మాస్టార్. ఆయన లెక్కలు బోధించే విధానం ఎంతో బాగుంటుంది. పిల్లలందరం అయస్కాంతంలా ఆకర్షితులైపోయి, పాఠాలు వినేవాళ్లం. నా విద్యార్ధి దశలో నన్ను బాగా ప్రభావితం చేసింది మా వరప్రసాద్ మాస్టర్ అని చెప్పాలి. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో ఆయన ముందుంటారు.
నేను ఎనిమిదో తరగతి అంటే... సెలవుల్లో ఆ తర్వాతి తరగతి పాఠాలు చెప్పి, నన్ను ఓ అడుగు ముందు నిలబెట్టేవారు. ప్రాపంచిక విషయాలపై ఆయనకు బాగా అవగాహన ఉండేది. మామూలుగా గ్రామాల్లో ఉండేవారికి అంత అవగాహన ఉండదు. కానీ, వరప్రసాద్ మాస్టర్ చాలా ప్రతిభావంతులు. అన్ని విషయాలను బాగా చెప్పేవారు. ఇక, రచయితగా నాకు బీజం పడేలా చేసింది మా డ్రిల్ మాస్టర్ మదీనాగారని నా భావన. క్లాస్ అయిన తర్వాత మాతో ఏదో ఒక పాట పాడించుకునేవారు. ఆ రకంగా పాటల వైపు నా ప్రయాణం అప్పుడే మొదలయ్యిందేమో అనిపిస్తుంటుంది.
- రామజోగయ్య శాస్త్రి