కుక్క చెప్పిన దేవుని కథ
కథ
ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలు కావస్తోంది. నేను సరుకుల కోసం మార్కెట్‌కి వెళ్లాను. రోడ్డంతా వాహనాలతో, నడిచే జనంతో రద్దీగా ఉంది. నడుచుకుంటూ షాప్‌కి వెళ్లి అన్నీ కొన్నాను. వెనక్కి వస్తూ బస్‌స్టాప్‌లో బస్‌కోసం ఎదురుచూస్తున్నా. ఈలోగా ఒక వీధికుక్క అటుగా వెళుతూ నా దగ్గరకొచ్చి ఆగింది. ఏమనుకుందో ఏమో? నాకేసి, నా సంచీకేసి చూస్తూ, నాలుక తాటిస్తూ, నా కళ్లల్లోకి కళ్లుపెట్టి చూస్తూ తన రెండు కాళ్లమీద కూర్చుండిపోయింది.
అసలే రోజులు బాలేవు. పైగా ఇది వీధికుక్క. పెద్దపెద్ద కోరలు, చెదిరి దుమ్ముపట్టిన బొచ్చు. కొంచెం భయం కలిగింది. ఆ మధ్య ఇలాగే ఒకతను... నాకు తెలిసిన వ్యక్తే... ఇలాంటి వీధికుక్క కరవడం వల్లే పాపం వ్యాధిన పడి, పోయాడు. కదిలితే అరుస్తుందేమో! ఉన్నట్టుండి పిక్క పట్టుకుంటే? అలాగే బిగుసుకుపోయి, తదేకంగా దాని కళ్లల్లోకి కళ్లుపెట్టి చూస్తున్నా. ఏమేమో ఆలోచనలు తెరలుతెరలుగా నాలో మెదలసాగాయి. చేతిలో ఇంత సంచీ ఉంది. దానికి ఈ సంచీలో ఏముందో తెలీదు. నేను అందులోంచి ఏ బండరాయో తీస్తే? ఏ కత్తో, సుత్తో, కర్రో తీసి కొడితే? ఈ ఆలోచన ఈ కుక్కకి రాదా? ఏంటి దీనికి నామీద ఇంతటి గుడ్డి నమ్మకం? నేనేం చేయను అని దానికి అంత ధీమా ఎందుకు? అసలు ఆ కోణంలో అది ఆలోచించదా? ఇదివరకు ఎవరో ఒకరు తరిమో? ఛీ... ఫో..! అనో, చాలారకాలుగా అనే ఉంటారుగా! సరే! ఏదేమైనా ఫర్లేదు, వాడు తినేదేదో అందులో ఉంచుతాడు అని పసిగట్టింది అనుకుందాం! అది నేను దానికి పెడతానన్న నమ్మకం ఏమిటి? ఒకవేళ నాపట్ల అలాంటి నమ్మకమే ఉంటే, ఆ నమ్మకానికి హేతువేంటి?
హు! అయినా నా పిచ్చిగానీ అసలు జంతువులు సహేతుకంగా ఎందుకు ఆలోచిస్తాయి? వాటికి అసలు పరిపూర్ణ జ్ఞానమే ఉండదు. ఏదో జీవం ఉన్నంతవరకూ జీవితం ఉంటుంది. దాన్ని నడపటానికి తెలియకుండా దొరికిన తిండి, కొంచెం రక్షణ... ఆ అనుభూతులకి నిర్వచనం తెలియకుండానే బతికేస్తాయి అంతే! అనుకున్నాను. చిన్నప్పుడు పూజ చేస్తున్న మా అమ్మ, ‘దేవుడికి దణ్నం పెట్టుకో’ అని అన్నప్పుడు, నేను అడిగిన ప్రశ్న ఈ సందర్భంలో మెరుపులా మెరిసింది. ‘‘అమ్మా! మరి జంతువులకి దేవుడు ఉండడా? అవి గుడికి వెళ్లవా? వాటికి పూజలు, ప్రార్థనలు ఉండవా?’’
మనుషులు ఆ భగవంతుణ్ని అర్థం చేసుకోవడానికి ఎన్నో చదవాలి, ఎన్నో చేయాలి... వేదాలు, శాస్త్రాలు, దర్శనాలు, వేదాంత సూత్రాలు, సత్ సంఘాలు, 9 భక్తి మార్గాలు, వ్రతాలు, పూజలు, ప్రార్థనలు.... ప్రపంచంలో నేటికీ 108కి పైచిలుకు మతాలు ఉన్నాయి. ఆ భగవత్ తత్త్వాన్ని మనకు విశదీకరించడానికి ఎన్నో సిద్ధాంతాలూ ఉన్నాయి, కొత్తగా వస్తున్నాయి.
అంతరిక్షం దగ్గరనుంచీ దైవ పదార్థం వరకు అన్నింటా అంతటా మనం శోధించగలుగుతున్నాం. (ఇంకా అన్ని మూలలకీ చేరుకోలేకపోయాం అనుకోండి). ఇవన్నీ మనకు ఏర్పడిన లేదా సంక్రమించిన (మనం ముద్దుగా పిలుచుకునే) విజ్ఞానం అనే మానసిక స్థితి వల్ల సాధించిన విషయాలు. మరి ఇంకా దేవుని ఉనికి మనకు ఎందుకు పూర్తిగా కనబడటం లేదు?
అనుకోకుండా మన పూర్వీకులు దొరకబుచ్చుకున్న ఒక ఫలమే ఈ జ్ఞానం అని బైబిల్ మహాగ్రంథం చెబుతోంది. అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా ‘ఎంత శోధింతురో వారు అంత దూరం నాకు’ అన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే వాటి సారాంశం... అజ్ఞానంలో ఉండే ఆనందం...ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అనవచ్చు.
ఉదాహరణకు, మన చిన్నతనంలో ఆ చంద్రుడి మీద కుందేలు మామ కథలు విన్నప్పుడు, ఇంటికప్పు మీంచి ఆ చంద్రుడిని ఒక అందమైన లోకంగా, అందులో అందమైన కుందేలును ఊహించిన ఒక చిన్నారి ఎదిగి విజ్ఞానం ద్వారా అవి కేవలం పెద్ద పెద్ద గుంటలు అని తెలుసుకుంటాడు. ఎదిగిన పిల్లాడు మళ్లీ ఆ చందమామలోని కుందేలు అందాలను చూడగలడా? ఇకపై గుంటలే కనిపిస్తాయి. మనకు సంక్రమించే జ్ఞానం కూడా అక్షరాలా అలాంటిదేనా?
అంటే, అనుకోకుండా మనకు ఏర్పడిన ఈ జ్ఞానం వెనక్కి తిప్పలేనిది. చందమామ కథలోలాగా, మనం అబ్బో అనుకునే విజ్ఞానం ఒకవిధంగా మన దురదృష్టం కావొచ్చు. ఎందుకంటే, ఈ విజ్ఞానం అనే తెరే మనల్ని విశ్వవ్యాప్తమైన పరమ తత్వానికి దూరం చేస్తున్నది కావొచ్చు. ఇలా చూస్తే అసలు భగవంతుడు అంటూ మనం నిర్వచించే ప్రయత్నమే అవివేకం కదా మరి. ఎప్పుడైతే అలా నిర్వచించ ప్రయత్నిస్తామో అప్పుడే స్పర్థలు సృష్టిస్తాం. అదంతా అవివేకమే అన్న విషయం నాకు తట్టింది. అంటే అసలు భగవంతుడు ఉన్నాడో లేడో అన్న ప్రశ్న అసలు లేదన్నమాట.
అందుకే ఆనందమయ స్థితి అనేది ‘అజ్ఞానం’తోనే ముడిపడివుంది అని చెప్పుకోవచ్చేమో! పసిపిల్లలు, జంతువులు అందుకే దేవుని తత్వాన్ని చాలా దగ్గరగా చూపగలుగుతారనుకుంటాను.ఆ కుక్కను చూస్తూ, ఏదేదో ఆలోచిస్తున్న నేను ఆ క్షణంలో తీర్మానించుకున్నాను. అంటే ఈ కుక్క కూడా తన ఇంద్రియాలతో ఆ పరమాత్మను చూడగలదన్నమాట? అచ్ఛ! ఈ కుక్క ఎంత అదృష్టవంతురాలు అనుకుంటూ, ఇంకా అలాగే దాని కళ్లలోకి చూస్తూ, నా సంచీలోంచి ఇందాక కొన్న బిస్కెట్స్ కొన్ని తీసి, దాని ముందర వేశాను. ఎంతో శ్రద్ధగా ఆ కుక్క అవన్నీ తిని తృప్తిగా నాకేసి చూసింది. నేను మళ్లీ దానికేసి చూస్తూ... హమ్మయ్య! ఏదైతేనేం... అది నన్ను కరవలేదు అనుకున్నా.
ఏమాత్రం దానికి సహాయం చేయాలన్న ఆలోచన లేని నానుంచి, దాని ఆహారం ఇప్పించుకున్న ఆ కుక్క ప్రవర్తనకు నవ్వుకున్నాను మనసులో. ‘నీ కళ్లు ఆ పరమాత్మను చూస్తాయి అని నేను గ్రహించాను కదా! మరి ఆ స్వరూపం ఎలా ఉంటుందో నాకు కాస్త చెప్పవూ?’ అని వేడుకోలుగా ఆ కుక్కను అడిగాను. వెంటనే అది లేచి, అటు తిరిగి, మళ్లీ ఒక్కసారి నాకేసి చూసి వెళ్లిపోయింది. నా ప్రశ్న విని పకాపకా నవ్వినట్లనిపించింది నాకు. ణువణువు నించి విశ్వాంతరాళం వరకు అనిర్వచనీయమైన వేల లక్షల కోట్ల పరమాత్మలు... సందర్భాలను బట్టి, పరిస్థితులను బట్టి, మన ప్రవర్తనల్ని బట్టి... మారుతూ, మెరుపులా కనిపిస్తూ, అంతలోనే మాయమవుతాయేమో! కరిచే అవకాశం ఉన్నా కరవని ఆ కుక్కలో ఆ క్షణం నాకు భగవంతుడు కనిపించాడు. ఇచ్చే ఆలోచనగానీ, ఇవ్వాలన్న ఉద్దేశంగానీ లేకపోయినా... ఆ పూటకి దానికి ఆహారం ఇచ్చినందుకు, కుక్కకు నాలో తన దయామూర్తి కనిపించి ఉండొచ్చు గాక! దే నాకు ఆ కుక్క చెప్పిన కథ!
- కాంత్ యర్రమిల్లి