మళ్లీ రెచ్చిపోయిన టీడీపీ నాయకులు
- ఇంటి స్థలం విషయై మహిళపై దాడి
- కపటనింగనపల్లిలో ఘటన
కళ్యాణదుర్గం : టీడీపీ నాయకుల ఆగడాలు శ్రుతిమించిపోతున్నాయి. జిల్లాలో ఎక్కడో ఒక చోట మహిళలపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా బ్రహ్మసముద్రం మండలం కపట నింగనపల్లిలో చంద్రమ్మ అనే మహిళపై టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. ఇంటి స్థల విషయంలో ఆమెను నిలదీస్తూ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన గురువారం జరిగింది. బాధితురాలి కథనం మేరకు... గ్రామ సర్వే నంంబర్ 249–5లో స్థలం దశాబ్దాలుగా చంద్రమ్మ కుటుంబం ఆధీనంలో ఉంది. ఆ స్థలానికి సంబంధించి గతంలో రెవెన్యూ అధికారులు ఇంటి పట్టా కూడా మంజూరు చేశారు.
గతంలో ఆ స్థలంలో మగ్గం వేసుకుని ఉపాధి చేసుకునే వారు. కరువు కారణంగా ఉపాధి కోసం బెంగళూరుకు వలస వెళ్లారు. తిరిగి గ్రామానికి వచ్చి ఖాళీ స్థలంలో మగ్గం వేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఆ స్థలం తమదంటూ గ్రామంలో టీడీపీకి చెందిన ఉప సర్పంచ్ మంజునాథ అభ్యంతరం తెలిపారు. సమస్య రెవెన్యూ అధికారుల దృష్టికీ వెళ్లింది. విచారణలో భాగంగా తహసీల్దార్ సుబ్రహ్మణ్యం, ఆర్ఐ నాయక్, సర్వేయర్ సూర్యనారాయణరెడ్డి, వీఆర్ఓ స్వామి వివాద స్థలాన్ని పరిశీలించి, సమస్య పరిష్కరించేందుకు వెళ్లారు. అధికారులకు ఆధారాలు చూపుతుండగా, ఒక్కసారిగా ఉపసర్పంచు మంజునాథ, వారి కుటుంబ సభ్యులు మంజమ్మ, పుష్పావతి, ఆది తదితరులు చంద్రమ్మపై దాడి చేసి కిందపడేసి తొక్కారు. ఘటనలో ఆమె రవిక సైతం చిరిగిపోయింది. వెంటనే కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రిలో చేరి బాధితురాలు చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ బ్రహ్మసముద్రం మండల కన్వీనర్ రామాంజినేయులు, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కుళ్లాయప్ప, తాలూకా అధ్యక్షుడు నాగరాజు, మండల కార్యదర్శి తిప్పేస్వామి, మండల నాయకుడు గోవిందు, తాలూకా కార్యదర్శి దొణస్వామి, మండల ఉపాధ్యక్షుడు రవి తదితరులు బాధితురాలిని పరామర్శించారు.