పేదోడి ఫోన్ మరింత ఖరీదు
అన్ని ఫోన్లపై ఇక 6 శాతం పన్ను...
రూ.2,000 లోపు మొబైల్స్‌పై భారం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సామాన్యుడి ఫోన్ ఇప్పుడు మరింత ఖరీదు కానుంది. చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్ పుణ్యమాని రూ.2 వేల లోపు ధర ఉన్న ఫోన్లు కూడా ప్రియం కానున్నాయి. ఇప్పటి వరకు ఈ ఫోన్లకు ఎక్సైజ్ డ్యూటీ 1 శాతం మాత్రమే. తాజా బడ్జెట్‌తో స్మార్ట్ఫోన్లకు సమానంగా ఎక్సైజ్ డ్యూటీ 6 శాతానికి చేరింది. దీంతో ఒక్కో ఫోన్‌పై రూ.40 నుంచి రూ.90 దాకా అదనంగా చెల్లించాల్సిందే. నెలకు ఒక కోటి బేసిక్ ఫోన్లు దేశవ్యాప్తంగా అమ్ముడవుతున్నాయి. అంటే నెలకు ఒక కోటి మంది భారతీయులపై భారం పడనుందన్న మాట. రాష్ట్రంలో ఇటువంటివి నెలకు 8 లక్షల ఫోన్లు విక్రయమవుతున్నాయి. ఈ కొత్త సుంకాలు సోమవారం నుంచే అమలులోకి వచ్చాయి. మొబైల్ ఫోన్లపై ఎక్సైజ్ డ్యూటీ సెన్‌వ్యాట్ క్రెడిట్‌తో 6 శాతం, సెన్‌వ్యాట్ క్రెడిట్ లేకుండా 1 శాతమని ఆర్థిక మంత్రి తన బడ్జెట్లో ప్రతిపాదించారు. కాగా, 2013-14 బడ్జెట్లో రూ.2 వేలు ఆపై ఖరీదున్న ఫోన్లకు ఎక్సైజ్ డ్యూటీని 6 శాతానికి చేర్చిన సంగతి తెలిసిందే.
కొత్త ధరలు ఇప్పటి నుంచే..
రూ.2 వేల లోపు ఖరీదున్న ఫోన్ల ధర 7 శాతం దాకా పెరిగే అవకాశం ఉందని కార్బన్ మొబైల్స్ ఛైర్మన్ సుధీర్ హసిజ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. నేడో, రేపో కొత్త ధరలు అమలులోకి రానున్నాయని చెప్పారు. దేశీయంగా ప్లాంట్లు పెట్టడం ద్వారా కంపెనీలకు పన్ను మినహాయింపులుంటాయని వివరించారు. డొమెస్టిక్ టారిఫ్ ఏరియాలో ఏర్పాటు చేసే యూనిట్లు ఎక్సైజ్ డ్యూటీ 6%కి బదులు 1 శాతమే చెల్లిస్తాయని, ఈ మేరకు కంపెనీలకు కలసి వస్తుందని ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పంకజ్ మొహింద్రూ పేర్కొన్నారు. నోకియా ఇండియా ఎండీ పి.బాలాజీ మాట్లాడుతూ దేశీయ మొబైల్ తయారీ పరిశ్రమను ప్రోత్సహించే చర్యలంటూ చిదంబరం బడ్జెట్‌ను స్వాగతించారు. అయితే లో-ఎండ్ ఫోన్లు కొనేవారిపై మాత్రం భారం తప్పదన్నారు.
12 కోట్ల ఫోన్లపై..: దేశవ్యాప్తంగా ఏటా సుమారు 22 కోట్ల ఫోన్లు అమ్ముడవుతున్నాయి. భారతీయ బ్రాండ్లవి 15.4 కోట్లుంటాయి. మొత్తం అమ్ముడవుతున్న ఫోన్లలో రూ.2 వేలలోపు ఖరీదున్నవి 12 కోట్ల ఫోన్లు ఉంటాయని అంచనా. మైక్రోమ్యాక్స్, కార్బన్, సెల్కాన్, లావా, వీడియోకాన్, ఇంటెక్స్ తదితర భారతీయ బ్రాండ్లు చైనా, థాయ్, కొరియాల నుంచి ఫోన్లను దిగుమతి చేసుకుంటున్నాయి. శాంసంగ్, నోకియాకు మాత్రమే భారత్‌లో సొంత ప్లాంట్లున్నాయి.
ప్రోత్సాహమే లేదు..
పన్నులు పెంచాం కాబట్టి దేశీయంగా ప్లాం టు పెట్టండి అంటే ఎలా? ప్లాంటు పెట్టడం వల్ల ఆ రాష్ట్రంలో మాత్రమే పన్ను మినహాయింపు వస్తుంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా వ్యాట్ వసూలు చేస్తున్నారు. అందుకే జీఎస్టీ త్వరితగతిన అమలులోకి రావాలని పారిశ్రామికవర్గాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. తక్కువ ధరకు స్థలం, నిరంతర విద్యుత్, నీటి సరఫరా, పన్ను మినహాయింపులు కల్పించాలి. పన్ను పెరిగింది కాబట్టి ఫోన్ల ధర పెంచక తప్పదు.
- వై.గురు, సెల్కాన్ సీఎండీ