మామిడి రుచిలెక్కలెరుగదు...
రుచులను షడ్రుచులుగా వర్ణించి వర్గీకరించారు...
రసాలను నవరసాలంటూ పరిమితి విధించి చెప్పారు...
ఇలా నిర్ణయించినవారికి మామిడి గురించి తెలుసో? లేదో?
ఆ ఒక్క పండులోనే ఎన్నో రసాలు...
చిన్న రసాలు, పెద్ద రసాలు, చెరుకు రసాలు...
మామిడిని ఆస్వాదించడానికి...
ఆ ఆరూ, ఈ తొమ్మిదీ సరిపోలేదు...
వంట వంక పెట్టుకుని... రెసిపీ పేరు పెట్టుకొని ...
కొత్త రుచుల అన్వేషణ చేస్తున్నారు...
ఆకలి రుచినీ, నిద్ర సుఖాన్నీ ఎరగనట్టే... మామిడి రుచులు లెక్కలెరగవు.
లెక్కలకు ప్రాధాన్యమిస్తే పండును వదిలేసి టెంకను తిన్నంత ఒట్టు.
ఈ వంటలన్నీ చేసేసి, కొత్తరుచుల గిన్నెలను పొయ్యి దించండి.
లెక్క లేని, అంతు లేని మామిడి వంటలను ఆస్వాదించండి.
మ్యాంగో చీజ్ కేక్
కావలసినవి:
హెవీ క్రీమ్ - కప్పు; కన్ఫెక్షనరీ పంచదార - 2 టేబుల్ స్పూన్లు; మేరీ బిస్కెట్ల పొడి - 3 కప్పులు; పనీర్ తురుము - 50 గ్రా;క్రీమ్ చీజ్ - 150 గ్రా., పనీర్ - 100 గ్రా., పాలు - పావు కప్పుపంచదార పొడి - 6 టీ స్పూన్లు, కరిగించిన బటర్ - 4 టేబుల్ స్పూన్లు
వెనీలా ఎసెన్స్ - టీ స్పూను, మామిడిపళ్లు - 2, మామిడిపండు గుజ్జు - పావు కప్పు
తయారీ:
ఒక పాత్రలో హెవీ క్రీమ్, 2 టేబుల్ స్పూన్ల కన్ఫెక్షనరీ పంచదార వేసి బాగా కలపాలి బిస్కెట్ల పొడి ఇందులో వేసి అన్నీ కరిగిపోయేలా కలపాలి
సర్వింగ్ బౌల్స్‌లో ఈ మిశ్రమాన్ని కింద వేసి గట్టిగా ఒత్తి వీటిని డీప్ ఫ్రిజ్‌లో సుమారు 10 నిమిషాలు ఉంచాలి
పనీర్ ను సన్నగా తురిమి కొద్దిగా నీరు జత చేసి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి
పనీర్ మిశ్రమానికి పంచదార పొడి, వెనీలా ఎసెన్స్, క్రీమ్ చీజ్ జత చేసి మెత్తగా అయ్యేవరకు గిలక్కొట్టాలి. (అవసరమనుకుంటే పాలు జత చేయాలి)
మామిడి పండు తొక్క తీసి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, సగం ముక్కలను చీజ్ మిశ్రమంలో వేయాలి
క్రీమ్ చీజ్ మిశ్రమాన్ని చీజ్ కేక్ బేస్ మీద పోసి, స్పూన్‌తో సర్దాలి
మామిడిపండు గుజ్జును పైన వేసి సుమారు గంట సేపు ఫ్రిజ్‌లో ఉంచాలి
చివరగా చీజ్ కేక్ పైన మామిడి పండు ముక్కలతో అలంకరించి, అందించాలి.
మ్యాంగో ముసిలీ
కావలసినవి:
కార్న్ ఫ్లేక్స్ - 100 గ్రా., ఓట్లు - 100 గ్రా. (ఎండబెట్టి వేయించాలి)
డ్రై ఫ్రూట్స్ - అర కప్పు (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి)
బాదం పప్పు, జీడి పప్పు, పిస్తా పప్పు - పావు కప్పు, నువ్వుపప్పు - పావు కప్పు (వేయించాలి)
పెరుగు - అర లీటరు, పచ్చి మామిడికాయ తురుము - 2 కప్పులు, తేనె - 4 టేబుల్ స్పూన్లు
తయారీ:
ఒక పాత్రలో కార్న్ ఫ్లేక్స్, వేయించిన ఓట్లు, వేయించిన నువ్వు పప్పు, డ్రై ఫ్రూట్స్ కలిపితే ముసిలీ తయారవుతుంది.
ఒక పాత్రలో పెరుగు, తేనె వేసి బాగా గిలక్కొట్టాలి.
ఒక గ్లాసులో ముందుగా పెరుగు + తేనె మిశ్రమం ఒక పొరలా వేయాలి.
ఆ పైన నాలుగు టేబుల్ స్పూన్లు ముసిలీ మిశ్రమం వేయాలి.
ఆ పైన పెరుగు మరో పొరలా వేయాలి.
చివరగా పచ్చిమామిడికాయ తురుము, ముసిలీ మిశ్రమం వేయాలి.
ఫ్రిజ్‌లో పది నిమిషాలు ఉంచి తీసి అందించాలి.
మ్యాంగో కార్డమమ్ పౌండ్ కేక్
కావలసినవి:
మైదా పిండి - ఒకటిన్నర కప్పులు, బేకింగ్ పౌడర్ - టీ స్పూను
బేకింగ్ సోడా - పావు టీ స్పూను, ఉప్పు - అర టీ స్పూను
ఏలకుల పొడి - టీ స్పూను, అన్ సాల్టెడ్ బటర్ - అర కప్పు
పంచదార - ముప్పావు కప్పు, గట్టి పెరుగు - 3 టేబుల్ స్పూన్లు
మజ్జిగ - 100 మి.లీ., మామిడి పండు గుజ్జు - అర కప్పు
మామిడి పండు ముక్కలు - కప్పు (చిన్న ముక్కలుగా కట్ చేయాలి)
ఐసింగ్ సుగర్ - టీ స్పూను (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది)
తయారీ:
అవెన్‌ను 180 డిగ్రీల దగ్గర ప్రీ హీట్ చేసి ఉంచాలి.
కేక్ టిన్ తీసుకుని దానిలో ముందుగా అన్ సాల్టెడ్ బటర్, ఆ తరవాత కొద్దిగా మైదా పిండి వేయాలి.
ఒక పాత్రలో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, మైదా పిండి, ఉప్పు వేసి కలపాలి.
బటర్లో పంచదార వేసి బాగా గిలక్కొట్టాలి.
పెరుగు జత చేసి మరోమారు గిలక్కొట్టాలి.
పెన తయారుచేసి ఉంచుకున్న మిశ్రమంలో మజ్జిగ, మామిడిపండు గుజ్జు, ఏలకుల పొడి వేసి బాగా కలపాలి.
సిద్ధంగా ఉన్న కేక్ టిన్‌లో ఈ మిశ్రమాన్ని పోయాలి.
సుమారు 45 నిమిషాలు బేక్ చేసి తీసేయాలి.
బాగా చల్లారాక పైన ఐసింగ్ సుగర్, మామిడిపండు ముక్కలు వే సి అందించాలి.
మ్యాంగో అండ్ జింజర్ జామ్
కావలసినవి:
మామిడి పండు ముక్కలు - 2 కప్పులు
పంచదార - పావు కప్పు
ఉప్పు - చిటికెడు
అల్లం తురుము - టీ స్పూను
నిమ్మరసం - టీ స్పూను
తయారీ:
అన్ని పదార్థాలను ఒక గిన్నెలో వేసి స్టౌ (సన్నని మంట) మీద ఉంచి సుమారు 20 నిమిషాలు ఉడికించాలి. (మాడకుండా ఉండేలా మధ్య మధ్యలో కలుపుతుండాలి)
రుచి చూసి పంచదార తగ్గినట్టు అనిపిస్తే కొద్దిగా జత చేయాలి.
బాగా చల్లారాక శుభ్రమైన గాజు సీసాలో ఉంచి ఫ్రిజ్‌లో భద్రపరిస్తే సుమారు నెల రోజులు నిల్వ ఉంటుంది.
మ్యాంగో పులిసేరీ
కావలసినవి:
మామిడిపండు - 1;
కొబ్బరి తురుము - 3 టేబుల్ స్పూన్లు;
ఎండు మిర్చి - 2; మెంతులు - అర టీ స్పూను;
చిక్కటి మజ్జిగ - ఒకటిన్నర కప్పులు; నూనె - 2 టీ స్పూన్లు;
ఆవాలు - అర టీ స్పూను; కరివేపాకు - రెండు రెమ్మలు; ఉప్పు - తగినంత
తయారీ:
ఇది కేరళ వంటకం
ముందుగామామిడి పండు తొక్క తీసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయాలి
ఒక పాత్రలో కొద్దిగా నీళ్లు, మామిడిపండు ముక్కలు, కరివేపాకు వేసి ఉడికించాలి
చిన్న బాణలిలో టీ స్పూను నూనె వేసి కాగాక మెంతులు, ఎండు మిర్చి వేసి వేయించి చల్లారాక, మిక్సీలో వేసి, కొద్దిగా నీళ్లు జత చేసి మెత్తగా చేసి, ఉడుకుతున్న మామిడిపండుగుజ్జులో వేయాలి
బాగా ఉడుకుతుండగా మజ్జిగ జత చేసి, కలిపి దించేయాలి
చిన్న బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడాక, కరివేపాకు వేసి వేయించి, మామిడిపండు గుజ్జులో వేయాలి
ఇది అన్నంలోకి, వేపుడులోకి బాగుంటుంది.
రా మ్యాంగో సలాడ్
కావలసినవి:
నువ్వు పప్పు - టేబుల్ స్పూను; పల్లీలు - టేబుల్ స్పూను; బెల్లం - టేబుల్ స్పూను; పచ్చి మామిడికాయ తురుము - కప్పు; రెడ్ క్యాప్సికమ్ తరుగు - అర కప్పు; ఎల్లో క్యాప్సికమ్ తరుగు - అర కప్పు; కొత్తిమీర తరుగు - నాలుగు టేబుల్ స్పూన్లు; ఉప్పు - తగినంత; మిరియాల పొడి - తగినంత
తయారీ:
బాణలిని స్టౌ మీద ఉంచి, వేడయ్యాక నువ్వుపప్పు, పల్లీలు విడివిడిగా వేసి వేయించి తీసేయాలి
చిన్న రోలు వంటి దాంట్లో పల్లీలు, నువ్వుపప్పు, బెల్లం వేసి, పొడిపొడిలా అయ్యేలా దంచి తీసి పక్కన ఉంచాలి
ఒక పాత్రలో పచ్చి మామిడికాయ తురుము, ఎల్లో క్యాప్సికమ్ తరుగు, రెడ్ క్యాప్సికమ్ తరుగు, ఉప్పు, మిరియాలపొడి వేసి కలిపి, ప్లేట్లోకి తీసుకోవాలి. (ముందుగా వీటిని ఫ్రిజ్‌లో ఉంచి చల్లబడనివ్వాలి)
సర్వింగ్ బౌల్స్‌లో కొద్దికొద్దిగా వేసి, పైన కొత్తిమీర, పల్లీలు + నువ్వుపప్పు + బెల్లం మిశ్రమం చల్లి అందించాలి.
సేకరణ: డా. వైజయంతి
కర్టెసీ: అరుంధతీరావ్