జిల్లా అభివృద్ధి కార్డులకు శ్రీకారం
♦ కరీంనగర్ బడ్జెట్ ప్లాన్‌పై తొలి కసరత్తు
♦ అధికారులతో ఆర్థిక మంత్రి ఈటల సమీక్ష
సాక్షి, హైదరాబాద్: జిల్లా అభివృద్ధి కార్డుల తయారీకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బడ్జెట్ రూపకల్పనలో భాగంగా తలపెట్టిన ఈ వినూత్న కసరత్తును ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ తన సొంత జిల్లా కరీంనగర్ నుంచి మంగళవారం ప్రారంభించారు. ఈ మేరకు జిల్లా అధికారులతో సమావేశమై ఆ జిల్లా అభివృద్ధికి కావాల్సిన 2016-17 బడ్జెట్ ప్రణాళిక రూపకల్పనపై చర్చించారు. 2015-16 బడ్జెట్లో కేటాయించిన నిధులు, మంజూరైన పనులు, అందులో పూర్తయినవి, పురోగతిలో ఉన్నవి, ఇంతవరకు గ్రౌండింగ్కాని పనుల వివరాలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు.
శాఖలవారీగా ఈ ఏడాది ఖర్చు చేసిన నిధులు, మార్చి వరకు ఖర్చయ్యే అంచనా నిధులు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో అవసరమయ్యే మొత్తం నిధులపై ప్రతిపాదనలను సమర్పించాలని సూచించారు. శాఖలవారీగా వీటిని క్రోడీకరించి జిల్లా అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని, సంబంధిత శాఖలకు ఆ ప్రతిపాదనలు పంపించాలని మంత్రి కలెక్టర్‌ను ఆదేశించారు. జిల్లాల నుంచి అందే ప్రతిపాదనలను పరిశీలించి, సంబంధిత శాఖలు ఏయే జిల్లాకు ఎన్ని నిధులు కేటాయించాలి.. ప్రాధాన్య క్రమంలో ఈ ఏడాది ఏయే కార్యక్రమాలు చేపట్టాలి, ఏయే పనులకు ఈ నిధులు వెచ్చించాలి.. అనే వాటిపై దిశానిర్దేశం చేస్తారు.
అన్ని శాఖలకు కేటాయించిన నిధులు.. వాటితో చేపట్టబోయే పనులేమిటనే వివరాలన్నీ క్రోడీకరించి.. 2016-17 జిల్లా అభివృద్ధి కార్డులను జిల్లా కలెక్టర్లు రూపొందిస్తారు. ఏయే శాఖకు ఎంత నిధులు కేటాయిస్తారో సోమవారం నాటికే వెల్లడించాల్సి ఉంది. అయితే, కేటాయింపుల తుది జాబితాను సీఎం ఆమోదానికి పంపించిన తర్వాతే వెల్లడించాలని ఆర్థికశాఖ భావిస్తోంది.
సీఎం ఆమోదమే తరువాయి: రెండు రోజులుగా సీఎం వరంగల్ జిల్లా పర్యటనలో ఉండటంతో ఈ కేటాయింపుల జాబితాకు ఆయన ఆమోదముద్ర పడలేదు. మరోవైపు రాష్ట్రానికి సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న వివిధ అంశాలపై నీతి ఆయోగ్‌తో భేటీ అయ్యేందుకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ప్రదీప్‌చంద్ర, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారమే ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. బుధవారం సమావేశం కానున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ అధికారులతోనూ చర్చలు జరుపుతారు. దీంతో వచ్చే ఏడాది కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తాయి? కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్రం ఎంత వెచ్చించాల్సి ఉంటుంది? అనే అంశాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశముంది.