రష్యాలో ఇద్దరు మహారాష్ట్ర విద్యార్థినుల మృతి
న్యూఢిల్లీ/ముంబై: రష్యా తూర్పు ప్రాంతంలోని స్మొలెన్స్క్ మెడికల్ అకాడమీలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థినిలు మృతిచెందగా, మరికొందరు గాయపడ్డారు. వీరిద్దరు మహారాష్ట్రకు చెందినవారని విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ట్వీట్ చేశారు. మాస్కోకు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అకాడమీకి భారత ప్రతినిధి బృందం వెళ్లిందని ఆమె తెలిపారు.
అగ్నిప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థినిలు మహారాష్ట్రకు చెందినవారు. నవీ ముంబైకి చెందిన పూజా కల్లూర్(22), పుణేకు చెందిన కరిష్మా భోసలే(20) ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరూ స్మొలెన్స్క్ మెడికల్ అకాడమీలో మెడిసిన్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నారు. పూజ, కరిష్మ మరణవార్త తెలియడంతో వారి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఈ వారంలోనే పూజ, కరిష్మ మృతదేహాలు స్వస్థలానికి తరలించనున్నారు.