క్లాస్‌రూమ్‌లో అమ్మాయిల జుట్టు పట్టుకుని..
అమ్మాయిలను జుట్టు పట్టుకుని తిప్పుతూ ఉన్మాదిలా ఊగిపోతూ కొట్టాడు. తలకు దెబ్బ తగిలేలా పలుమార్లు బలంగా కొట్టాడు. చెంపలు వాయించాడు. అమ్మాయిలను గొడ్డును బాదినట్టు బాదాడు. ఇక అబ్బాయిలపైనా ఇదే ప్రతాపం చూపించాడు. దెబ్బలు తిన్న ఈ అమ్మాయిలు, అబ్బాయిలు నేరస్తులేమీ కాదు.. భావి భారత విద్యార్థులు. హోం వర్క్ చేయకపోవడమే వీళ్లు చేసిన నేరం. వీధి రౌడీలా ప్రవర్తించిన ఆ వ్యక్తి టీచర్. హరియాణాలోని కర్నల్‌లో టీచర్ చేసిన నిర్వాకాన్ని ఓ విద్యార్థి రహస్యంగా వీడియో తీశాడు.
కర్నల్‌లోని ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో టీచర్ విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. ఈ టీచర్‌ను ప్రదీప్ ఆరోరాగా గుర్తించారు. కోచింగ్ సెంటర్ యజమాని కూడా ఇతడే. హోం వర్క్ చేయని 10, ఇంటర్ విద్యార్థులను దారుణంగా కొట్టాడు. క్లాస్‌లో వెనుక వైపు కూర్చున్న ఓ విద్యార్థి మొబైల్ ఫోన్‌తో టీచర్ నిర్వాకాన్ని వీడియో తీశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు ఓ టీవీలో ప్రసారమవడంతో టీచర్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. టీవీలో ప్రసారమైన వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్టు కర్నల్ ఎస్పీ పంకజ్ నైన్ చెప్పారు. కాగా విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు కానీ టీచర్‌పై ఫిర్యాదు చేయలేదు.
ప్రదీన్ అరోరా రిటైర్డ్ నేవీ ఉద్యోగి. మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యార్థులకు ఎలాంటి శిక్షయినా వేయాలని తల్లిదండ్రులు తనకు చెప్పారని వివరణ ఇచ్చాడు.