అంత్యక్రియలకు తీసుకెళ్తుంటే.. లేచి కూర్చున్నాడు!
చనిపోయారు అనుకున్నవాళ్లు చిట్ట చివరి నిమిషంలో బతికి బయటపడటం చాలా అరుదుగా జరుగుతుంది. కర్ణాటకలోని ధార్వాడ్ ప్రాంతంలో సరిగ్గా ఇలాగే జరిగింది. 17 ఏళ్ల యువకుడు మరణించాడనుకుని అతడి బంధువులు అంత్యక్రియలకు తీసుకెళ్లసాగారు. దారిలో ఉన్నట్టుండి ఆ యువకుడు లేచాడు. దాంతో మనగుండి గ్రామంలోని అతడి బంధువులు, ఇతర గ్రామస్తులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. దాదాపు నెల రోజుల క్రితం వీధికుక్క కరవడంతో కుమార్ మారేవాడ్ (17)కు తీవ్రంగా జ్వరం వచ్చింది. అతడిని ధార్వాడ్ లోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. అతడి పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై పెట్టారు. అతడి పరిస్థితి బాగా విషమంగా ఉందని, వెంటిలేటర్ తీస్తే ఇక బతకడని వైద్యులు చెప్పారు. అతడి శరీరమంతా ఇన్ఫెక్షన్ వ్యాపించిందని, ఇక ఏం చేయాలో మీరే నిర్ణయించుకోవాలని అతడి కుటుంబ సభ్యులకు తెలిపారు. దాంతో.. వాళ్లు ఇక అతడిని ఇంటికి తీసుకెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు.
ఇంటికి తీసుకెళ్లిన కాసేపటికే అతడికి శ్వాస ఆడకపోవడం, శరీరకంలో కదలికలు కూడా ఏమీ లేకపోవడంతో.. అతడు మరణించాడనే బంధువులంతా భావించారు. అతడి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అంతిమయాత్ర కూడా మొదలైపోయింది. మరొక్క రెండు కిలోమీటర్లు వెళ్తే శ్మశానానికి చేరుకుంటారనగా.. ఉన్నట్టుండి కుమార్ లేచాడు. అతడి చేతులు, కాళ్లు కదిలిస్తూ ఊపిరి కూడా పీల్చుకున్నాడు. వెంటనే అతడిని గోకుల్రోడ్డులోని ఒక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడు మెనింగోఎన్సెఫలైటిస్తో బాధపడుతున్నట్లు భావిస్తున్నామని, కుక్క కాటు వల్ల ఆ తరహా ఇన్ఫెక్షన్ వస్తుందని డాక్టర్ మహేష్ నీలకంఠంవార్ తెలిపారు. రోజు కూలీలుగా పనిచేస్తున్న కుమార్ తల్లిదండ్రులు నింగప్ప, మంజుల మాత్రం.. అతడి చికిత్సకు అయ్యే ఖర్చు భరించలేకపోతున్నామని, ఏం చేయాలో అర్థం కావట్లేదని వాపోతున్నారు.