ప్రాణం తీసిన డ్వాక్రా అప్పు
♦ రుణం తీసుకొని సంఘం సభ్యులు ఇద్దరు పరారీ
♦ డబ్బులు చెల్లించాలని అధికారులు, మిగతా సభ్యులునుంచి ఒత్తిడి
♦ మనస్తాపంతో మహిళ ఆత్మహత్యహత్యాత్నం
♦ చికిత్స పొందుతూ మృతి
తాండూరు రూరల్: డ్వాక్రా సంఘంలో రుణం తీసుకున్న ఇద్దరు పరారీ అయ్యారు. వారి డబ్బులు చెల్లించాలని అధికారులు, సంఘం సభ్యులు ఒత్తిడి చేయడంతో సంఘం రెండో అధ్యక్షురాలు ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండల పరిధిలోని మల్కాపూర్‌లో సోమవారం వెలుగు చూసింది. కరన్‌కోట్ ఎస్ఐ రేణుకారెడ్డి, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఫాతిమాబేగం (40) కూలీపనులు చేస్తూ జీవనం సాగిస్తుండేది. గ్రామంలోని హినా పొదుపు సంఘంలో ఆమె రెండో గ్రామ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తుండేది.
ఈక్రమంలో కొంతకాలం క్రితం హినా పొదుపు సంఘం సభ్యులు మల్కాపూర్ ఎస్బీహెచ్లో బ్యాంక్ లీంకేజీ ద్వారా రూ.3 లక్షలు రుణం తీసుకున్నారు. పది మంది సభ్యులు కొన్ని వాయిదాలు చెల్లించారు. హినా సంఘం మరో అధ్యక్షురాలు మౌలన్బీతో పాటు సాలియాబీ చెప్పాపెట్టకుండా గ్రామం విడిచి వెళ్లిపోయారు. దీంతో వారి వాయిదాలు చెల్లించాలని మిగతా సభ్యులు, బ్యాంకు అధికారులు ఫాతిమాబేగంపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఈనెల 24న ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. కుటుంబీకులు చికిత్స నిమిత్తం తాండూరులోని జిల్లా ఆస్పత్రికి.. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం అర్ధరాత్రి ఫాతిమాబేగం మృతి చెందింది. ఆమె ఉస్మానియాలో చికిత్స పొందుతుండగా న్యాయమూర్తి ఆమెనుంచి వాంగ్మూలం సేకరించారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.