నాలుగవ కార్తీక సోమవారానికి ఏర్పాట్లు సిద్ధం
- 3.30గంటల నుంచే దర్శన ఆర్జితసేవలు
-· క్యూల్లోని భక్తులకు పాలు, అల్పాహారం వితరణ
శ్రీశైలం: ద్వాదశ జ్యోతిర్లింగ శైవక్షేత్రం శ్రీశైలమహాక్షేత్రంలో నాల్గవ కార్తీక సోమవారానికి ఏర్పాట్లు సిద్ధం చేశామని ఈఓ నారాయణ భరత్ గుప్త తెలిపారు. శనివారం ఈఓ చాంబర్లో ఏసీ మహేశ్వరరెడ్డి, ఈఈ రామిరెడ్డి, ఏఈఓ, పర్యవేక్షకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడతూ నాల్గవ కార్తీక సోమవారం రోజున లక్షలాదిగా భక్తులు తరలివస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేశామన్నారు. అందులో భాగంగా ఆలయ పూజావేళ్లలో మార్పులు చేశామన్నారు. వేకువజామున 2.30గంటలకు మంగళవాయిద్యాలు, సుప్రభాతం, మహామంగళహారతి, 3.30గంటల నుంచి దర్శన ఆర్జితసేవలు ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉంచే భక్తులతో పాటు అభిషేక సేవాకర్తల కోసం పాలు, అల్పాహారం, మజ్జిగ అందజేయనున్నామన్నారు. వేకువజామున 3.30గంటల నుంచి 5 విడతలుగా సామూహిక అభిషేకాలు నిర్వహిస్తామని, సర్వదర్శనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఈఓ తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా క్యూలు సాఫీగా సాగేందుకు ప్రత్యేక విధులపై సిబ్బందితో పాటు, శివసేవకులను నియమిస్తున్నామన్నారు. రద్దీ కారణంగా నెట్వర్క్ ఇబ్బందులను అధిగమించడానికి వాకీటాకీలను సిబ్బందికి అందజేయనున్నట్లు చెప్పారు.