karunakarreddy
-
యార్లగడ్డకు ఆటా, టాటా జీవిత సాఫల్య పురస్కారం
న్యూఢిల్లీ: కేంద్రీయ హిందీ సమితీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌కు అమెరికన్ తెలుగు సంఘం(ఆటా), తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(టాటా)లు కలిసి జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రకటించాయి. మే 31, జూన్1, జూన్ 2లలో డల్లాస్‌లో రెండు సంస్థలు ఏర్పాటు చేసిన సదస్సులో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌కి ఈ పురస్కారం అందజేయనున్నట్టు ఆటా అధ్యక్షుడు డా. కరుణాకర్ రెడ్డి, టాటా అధ్యక్షుడు డా. హరినాథ్ పొలిచెర్ల ప్రకటించారు. 1990లో ఏర్పడిన ఆటా, 2015లో ఏర్పడిన టాటాలు మొట్టమొదటిసారిగా సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహించడం ఇదే మొదటిసారి. అమెరికా వ్యాప్తంగా దాదాపు 4500 మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖ రచయితలు, కవులు, మేధావులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామిక వేత్తలు, డాక్టర్లు, కళాకారులు, యువకులు ఈ సదస్సులో పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు. కాగా, ఉభయ భాషల్లో పీహెచ్డీ చేసి, పద్మభూషణ్, పద్మశ్రీ, కేంద్ర సాహిత్య అకాడమీతో పాటు అనేక పురస్కారాలు పొంది, 60కి పైగా పుస్తకాలు రచించిన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌కు ఈ సందర్భంగా జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేయాలని నిర్ణయించినట్లు రెండు సంఘాలు తెలిపాయి. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు రెండింటి సాంస్కృతిక వారధిగా, ఆదర్శంగా భావిస్తున్నట్లు ప్రకటించాయి. డల్లాస్‌లో ఉభయ సంఘాలు కలిసి నిర్వహిస్తున్న ఈ సదస్సుకు చారిత్రక ప్రాధాన్యత ఉన్నదని నిర్వాహకులు పేర్కొన్నారు. -
యువతకు స్ఫూర్తి చెవిరెడ్డి
తుమ్మలగుంట(తిరుపతి రూరల్): ఆధ్యాత్మిక, ప్రజాసేవ కార్యక్రమాలలో చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి యువతకు స్ఫూర్తి అని తిరుపతి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి కొనియాడారు. సోమవారం వినాయక చవితి సందర్భంగా తుమ్మలగుంట శ్రీకల్యాణ వెంకన్న ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో 10వేల పీచు టెంకాయలతో ఏర్పాటు చేసిన భారీ నారీకేళ వినాయక విగ్రహానికి భూమన ప్రథమ పూజలు చేశారు. అంతకు ముందు కళ్యాణ వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ యువతలో భక్తిభావం పెంపొందించేందుకు భాస్కర్‌రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. పర్యావరణానికి హాని కలుగకుండా మట్టితో తయారు చేసిన 25 వేల వినాయక విగ్రహాలను చెవిరెడ్డి ఉచితంగా అందించడం హర్షణీయమని తెలిపారు. యువతను సన్మార్గం వైపు నడిపించాలనే... పర్యావరణ పరిరక్షణలో భాగంగానే రాయలసీమలోనే ఎక్కడా లేని విధంగా 10వేల పీచు టెంకాయలతో 43 అడుగుల ఎత్తులో భారీ నారీకేళ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు చంద్రగిరి ఎమ్మెల్యే, కళ్యాణ వెంకన్న ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. మత సామరస్యానికి ప్రతీకగా ముస్లింలు ఆష్రాఫ్, షరీఫ్ భక్తితో 516 కిలోల భారీ లడ్డూను స్వామి వారికి సమర్పించారని చెప్పారు. ఆరవ రోజు శనివారం లడ్డూ వేలం జరుగుతుందని, ఆదివారం నిమజ్జనం జరుగుతుందన్నారు. నిమజ్జన ఊరేగింపులో పాల్గొనే భక్తులందరికీ వినాయక విగ్రహం తయారీకి ఉపయోగించిన కొబ్బరికాయలను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. ఈ కొబ్బరికాయను ఇంటి ముందు కట్టినా, పూజకు వాడినా శుభం జరుగుతుందని పండితులు తెలిపారని చెప్పారు. పట్టువస్త్రాలు సమర్పించిన డాక్టర్ కృష్ణప్రశాంతి దంపతులు నారీకేళ వినాయకుడికి హర్షిత ఆస్పత్రి అధినేతలు డాక్టర్ సిద్ధా హరినాథరెడ్డి, డాక్టర్ కృష్ణప్రశాంతి గజమాలను, పట్టు వస్త్రాలను సమర్పించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి ఇంటి నుంచి విగ్రహాం వరకు మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా వీటిని తీసుకువచ్చారు. సర్పంచ్ మించల జయలక్ష్మి, ఉపసర్పంచ్ గోవిందరెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు సరస్వతీ, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దామినేటి కేశవులు, మాజీ సర్పంచ్ చెవిరెడ్డి జయచంద్రారెడ్డి, సిద్ధారెడ్డి, భక్తులు పాల్గొన్నారు.