హీరోపై మరో కేసు నమోదు
పాట్నా: బాలీవుడ్ ప్రముఖ నటుడు సన్నీ డియోల్పై తాజాగా మరో కేసు నమోదైంది. దర్శకుడు చంద్ర ప్రకాశ్ ద్వివేది దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మోహల్లా అస్సీ' చిత్రంలో సన్నివేశాలు హిందూవుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ న్యాయవాది ఓజా బీహార్లోని పాట్నా అడిషినల్ కోర్టును ఆశ్రయించారు.
దాంతో ఆ చిత్రంలోని హీరో, దర్శకుడు, కథ రచయితతోపాటు ఇతర పాత్రధారులపై కూడా కేసులు నమోదు చేయాలని పాట్నా అడిషినల్ చీఫ్ మేజిస్ట్రేట్ రామచంద్ర ప్రసాద్ పోలీసులను శనివారం ఆదేశించారు. దాంతో సన్నీడియోల్, చిత్ర దర్శకుడు చంద్ర ప్రకాశ్ ద్వివేదితోపాటు కథ రచయిత కాశీనాథ్ సింగ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే ఇప్పటికే మోహల్లా అస్సీ చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయని ఆరోపిస్తూ సామాజిక స్వచ్ఛంద సంస్థ సర్వజన్ జాగృతి సంతష్ట గత నెల జూన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో పోలీసులు దర్శకుడితో పాటు సన్నీ డియోల్ పై కేసు నమోదు చేసిన విషయం విదితమే.
ఈ చిత్రం కాశీ కా అస్సీ నవల ఆధారంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సన్నీ డియోల్ సంప్రదాయ మత పెద్దగా కీలక పాత్ర పోషిస్తుండగా, అతనికి భార్యగా సాక్షి తన్వర్ నటిస్తోంది.