కా.రా. మాస్టారుకు ఎన్టీఆర్ జాతీయ అవార్డు
సాక్షి, హైదరాబాద్/శ్రీకాకుళం: తెలుగు కథా సాహిత్యంలో అగ్రగణ్యులు కాళీపట్నం రామారావు (కా.రా.మాస్టారు)ను ఎన్టీఆర్ జాతీయ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.రమణాచారి వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ జాతీయ అవార్డు కింద ఆయనకు బంగారు పతకంతో పాటు లక్ష రూపాయల నగదు పారితోషికాన్ని ఎన్టీఆర్ జయంతి రోజైన మే 28న ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి నగదు పారితోషికాన్ని రూ. 1.50 లక్షలు చేస్తున్నామని చెప్పారు.
కథా సాహిత్యాన్ని తారస్థాయికి తీసుకువెళ్లిన శ్రీకాకుళంకు చెందిన కా.రా.మాస్టర్‌ను ఈ అవార్డుకు ఏకగ్రీవంగా ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులు, ట్రస్ట్ సలహాదారు డా. కె.శివారెడ్డి, ట్రస్ట్ సభ్యురాలు మృణాళిని, ఓల్గాలను రమణాచారి అభినందించారు. దేశవ్యాప్తంగా ప్రముఖ సాహితీవేత్తలను ఈ అవార్డుకు ఎంపిక చేసి.. వారిని తగు రీతిలో గౌరవిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. సాహిత్యం వల్లే ఎన్టీఆర్‌తో తనకు పరిచయమైందని గుర్తుచేశారు. ఆయన మరణానంతరం స్థాపించిన ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్ట్ ద్వారా సాహితీ కృషీవలులకు ఎన్టీఆర్ జాతీయ అవార్డును ప్రదానం చేయడం తనకు ఆత్మానందాన్ని ఇస్తుందన్నారు. గత పది సంవత్సరాలుగా సాహిత్య దిగ్గజాలను ఈ అవార్డుతో గౌరవిస్తుండటంలో సాహిత్యానికి నిలువెత్తు రూపమైన రమణాచారి కృషి ఎంతో ఉందన్నారు. సమావేశంలో మృణాళిని, డా. కె. శివారెడ్డి, ఓల్గా పాల్గొన్నారు.
కథానిలయ స్థాపకుడు..
కా.రా.మాస్టారు 1924 నవంబర్ 9న శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలోని మురపాక గ్రామంలో జన్మించారు. 1943 నుంచి విశాఖలో పలు ఉద్యోగాలు చేశారు. తరువాత భీమునిపట్నంలో ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించారు. సాహిత్యం ద్వారా పారితోషికం, సన్మానాల ద్వారా లభించిన ప్రతి పైసాను కూడబెట్టి భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని 1997 పిబ్రవరిలో ‘కథానిలయం’ ఏర్పాటు చేశారు.