పత్రాలున్నా.. వేధింపులే..!
ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 2.37 లక్షల ఎకరాల్లో ఆదివాసీలు పోడు వ్యవసాయం చేసుకుంటున్నట్లు అంచనా. అటవీ హక్కుల చట్టం ప్రకారం కేవలం 1.33 లక్షల ఎకరాల భూములకు హక్కు పత్రాలు ఇచ్చినట్లు ఐటీడీఏ గణాంకాలు చెప్తున్నాయి. అంటే.. మిగతా పోడు భూములపై గిరిజనులకు హక్కు పత్రాలేమీ లేవు. దీంతో.. వారిలో చాలా మందిని ఆయా భూముల నుంచి ఖాళీ చేయించేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోంది. కొన్ని చోట్ల మక్కు పత్రాలు పొందిన ఆదివాసీలకు సైతం అటవీ శాఖ నుంచి వేధింపులు తప్పడం లేదు. ‘మీకు పత్రాలు ఇచ్చిన భూమి వేరే చోట ఉంది.. ఈ భూమి నుంచి ఖాళీ చేయండి’ అంటూ అధికారులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని గిరిజనులు వాపోతున్నారు. ఇక జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వు ప్రాజెక్టు పేరుతో ఏకంగా ఆదివాసీ గూడేలనే ఖాళీ చేయించేందుకు అటవీశాఖ ప్రయత్నిస్తోంది. ఈ ప్రాజెక్టు కోర్ ఏరియా పరిధిలోని 11 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న ఆదివాసీ గూడేలను అటవీ ప్రాంతం నుంచి తరలించేందుకు చర్యలు చేపట్టింది.
4 నెలలుగా బియ్యం పోయడం లేదు..
మేం 20 ఏళ్ల కిందటే ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి వలస వచ్చాం. తలా రెండెకరాలు, మూడెకరాలు పోడు నరుక్కొని వ్యవసాయం చేస్తూ బతుకుతున్నాం. గత నాలుగు నెలల నుంచి మాకు రేషన్ పోయడం లేదు. మా రేషన్ కార్డులు రద్దు చేశామని అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే సాయం అందకపోతే మేము ఇక్కడ్నుంచి వెళ్లిపోతామని వారు భావిస్తున్నారు. అడవిని నమ్ముకుని బతికే మేము.. ఎక్కడికి వెళ్లాలి? ఎలా బతకాలి?
- మడుకు భీమయ్య, చండ్రుపట్ల,
కొత్తగూడెం మండలం , ఖమ్మం జిల్లా
పదిహేడేళ్లుగా సాగు చేస్తున్నా పట్టాలివ్వలేదు..
నేను 17 సంవత్సరాలుగా పోడు వ్యవసాయం చేస్తున్నాను. అయినా ప్రభుత్వం నేటివరకూ పట్టాలివ్వలేదు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కొన్ని గ్రామాల్లో పట్టాలిచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వమైనా మాకు పట్టాలు ఇస్తుందనుకున్నాం. కానీ.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వమే హరితహారం పేరుతో పోడు భూములను బలవంతంగా లాక్కుంటోంది.
- జలగం సన్యాసి, గిరిజన రైతు,
దుమ్ముగూడెం, ఖమ్మం జిల్లా