భారత్ కేంద్రంగా వృద్ధి ప్రణాళికలు
హైదరాబాద్: ప్యానాసానిక్ కంపెనీ వృద్ధి ప్రణాళికలకు భారత్ కీలకమని ఆ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతమున్న వ్యాపారాన్ని మరింత పటిష్టం చేసుకోవడంతో పాటు కొత్త ఉత్పత్తుల కేటగిరిలోకి ప్రవేశిస్తామని ప్యానాసానిక్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ కజుహిరో సుగ పేర్కొన్నారు. . వ్యాపార వృద్ధి ప్రణాళిక నిమిత్తం ఆయన ఇటీవలనే భారత్‌లో పర్యటించారు. తన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీని ఆయన కలిశారు. భారత ప్రభుత్వపు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
మేక్ ఇన్ ఇండియా ద్వారా భారత్ తయారీ కేంద్రంగా మారుతుందని, ఎగుమతులు పెరుగుతాయని పేర్కొన్నారు. పట్టణీకరణ వల్ల ఉత్పన్నమవుతున్న సవాళ్లను స్మార్ట్‌సిటీల ఏర్పాటు ద్వారా ఎదుర్కొనవచ్చని వివరించారు. భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టామని, 15 వేలమందికి ఉపాధి కల్పించామని పేర్కొన్నారు. ప్లాంట్ల ఏర్పాటుకు, మార్కెటింగ్ తదితర కార్యాల కోసం మరిన్ని పెట్టుబడులు పెడతామని తెలిపారు. భారత అభివృద్ధికి ప్యానాసానిక్ ఇతోధికంగా తోడ్పడుతుందని హామీ ఇచ్చారు. తమ అంతర్జాతీయ వృద్ధి ప్రణాళికలకు భారత్ కేంద్రం కానున్నదని ప్యానాసానిక్ ఇండియా ప్రెసిడెంట్ డైజో ఇటో పేర్కొన్నారు.