నాటకమే నా ఊపిరి.. ప్రాణం
సినీదర్శకుడు రవీంద్రరెడ్డి అంతరంగం
కర్నూలు (కల్చరల్): నాటకమే నా ఊపిరి..ప్రాణమని సినీ దర్శకుడు నారసాని రవీంద్రరెడ్డి పేర్కొన్నారు. కర్నూల్లో జరుగుతున్న రాష్ట్రస్థాయి నాటక పోటీల్లో ‘అమ్మకో ముద్దు’ నాటకాన్ని ఆదివారం ఆయన ప్రదర్శించారు. 1982లో శోభన్‌బాబు, సుజాత నటించిన వంశగౌరవం సినిమాకు దర్శకత్వం వహించిన రవీంద్రరెడ్డి పలు సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేశారు. సత్యనారాయణ హీరోగా దాదా అనే హిందీ సినిమాకు దర్శకత్వం వహించారు. ఉయ్యాల జంపాల, అత్తా ఒకనాటి కోడలే, భూమి కోసం తదితర సినిమాలకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేసిన రవీంద్రరెడ్డి మళ్లీ నాటకాల వైపుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి‘తో తన అంతరంగాన్ని ఆవిష్కరించారు.
ఆయన మాటల్లోనే..
గుంటూరు జిల్లాలోని నంబూరు మా సొంతూరు. మా అమ్మ తులసమ్మ, నాన్న హనుమంతరెడ్డి. నన్ను చిన్నప్పటి నుంచి నాటకాల వైపు బాగా ప్రోత్సహించారు. నంబూరు జిల్లా పరిషత్ స్కూల్లో చదివే రోజుల్లో వార్షికోత్సవాలు ఘనంగా జరిగేవి. నేను ప్రాథమిక పాఠశాలలో చదివేటప్పుడు ఏడేళ్ల ప్రాయంలోనే ‘దొంగ వీరడు’ అనే నాటకంలో మురళి పాత్ర వేశాను. ఆ తర్వాత స్కూల్లో మాస్టార్జీ, లంకెబిందెలు అనే నాటకాల్లో నేను చేసిన పాత్రలకు మంచి స్పందన లభించింది. అది మొదలు నేను నాటకాల వైపు దృష్టి సారించాను.
గుంటూరులో హిందూ కాలేజ్‌లో పీయూసీ చదువు పూర్తయ్యాక అభినయ ఆర్ట్స్ అకాడమీ స్థాపించి నాటకాలు రూపొందించే పనుల్లో పడ్డాను. నేను దర్శకత్వం వహించిన ‘తూర్పు తెల్లారింది’ అనే నాటకం రాష్ట్ర వ్యాప్తంగా చాలా పరిషత్తుల్లో ప్రదర్శించడం జరిగింది. ఆ నాటకంలో నేను వేసిన కొండలు వేషం నాకు బాగా పేరు తెచ్చింది. సూరీడు అనే నాటకంలో శివుడు పాత్రకు కూడా బాగా పేరొచ్చింది.
1977లో సినీరంగ ప్రవేశం..
నేను 1977లో మద్రాస్‌కు వెళ్లి అలనాటి ప్రసిద్ధ డెరైక్టర్ కె.బి.తిలక్ దగ్గర అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేరాను.1989దాకా సినీరంగంలో దర్శకత్వ శాఖలో పనిచేశాను. అత్తా ఒకింటి కోడలే, ఉయ్యాల, జంపాల, భూమి కోసం తదితర హిట్ సినిమాలకు పనిచేశాను. 1982లో శోభన్‌బాబు హీరోగా నేను దర్శకత్వం చేసిన ‘వంశగౌరవం’సినిమా బాగా ఆడింది. ఆ తర్వాత నేను ఆత్మ, హ్యాపీ హోం, స్వాతి అనే టీవీ సీరియల్స్‌కు దర్శకత్వం వహించాను. పలుసార్లు ఉత్తమ దర్శకునిగా, ఉత్తమ నటునిగా అవార్డులు అందుకున్నాను.
సతీమణి శస్త్రచికిత్స వదిలి నాటక ప్రదర్శనకు..
ఒకసారి నా శ్రీమతికి డెలివరీ అనంతరం ఒక శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది. అయితే అదే రోజున నేను సూరీడు నాటకం ప్రదర్శించాల్సి ఉంది. . నేను వెళ్లకపోతే నాటకం ఆగిపోతుంది. శ్రీమతి ఆరోగ్యం పరిస్థితి బాగా లేకున్నా ఆమెను వదిలి నేను నాటక ప్రదర్శనకు వెళ్లాను. నాటకం సక్సెస్ అయింది. ఆ క్షణాలు తల్చుకుంటే గుండె బరువెక్కుతుంది. నాటక రంగంలోని వాళ్లకు ఇటువంటి క్షణాలు తప్పవు.