అల్లూరి జయంతికి ఏర్పాట్లు పూర్తి
గొలుగొండ: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం జరగనున్న వేడుకలకు కేడీపేటలో అల్లూరి పార్కు ముస్తాబైంది. శుక్రవారం సాయంత్రం నర్సీపట్నం ఆర్డీవో సూర్యారావు పార్కును సందర్శించారు. ఏర్పాట్లను పర్యవేక్షించారు. సమాధుల వద్ద గార్డెన్‌ను మెరుగుపరిచారు. అల్లూరి, గంటందొర సమాధులను పూలతో అలంకరిస్తున్నారు. జయంతి వేడుకలకు సుమారు రెండు వేలమంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరందరికీ అసౌకర్యం కలగకుండా సామియానాలు ఏర్పాటుచేస్తున్నారు. పార్కులో సుమారు వందకు పైగా ఆధునిక విద్యుత్దీపాలను ఏర్పాటుచేశారు. పర్యాటకులకు ఇబ్బంది లేకుండా తాగునీరు సమకూర్చారు. వీరికోసం కాటేజీలు ఏర్పాటుచేశారు.
భవనాలను అందంగా తీర్చిదిద్దారు. వీటిలో ఒకదానిలో అల్లూరి జీవిత చరిత్రకు సంబంధించి పుస్తకాలు, చిత్రాలు అందుబాటులో ఉంచుతున్నారు. జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించిన ప్రభుత్వం పార్కు అభివృద్ధికి సుమారు రూ.20 లక్షల మేర నిధులు మంజూరుచేసింది. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ జయంతి వేడుకలకు సంబంధించి దాదాపుగా ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. ఎంపీపీ సుర్ల లక్ష్మీనారాయణ, జెడ్పీటీసీ చిటి కెల తారకవేణుగోపాల్, ఎంపీడీవో పద్మజకు సూచనలు చేశారు. వేడుకలకు విచ్చేసేవారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని వారిని కోరారు.