గోల్‌కీపర్ గురుప్రీత్ కొత్త చరిత్ర
యూరోప్ లీగ్‌లో ఆడిన తొలి భారత ఫుట్‌బాలర్‌గా గుర్తింపు
న్యూఢిల్లీ: భారత జాతీయ ఫుట్‌బాల్ జట్టు గోల్ కీపర్ గురుప్రీత్ సింగ్ సంధూ కొత్త చరిత్ర సృష్టించాడు. ఐకేస్టార్ట్తో ఆదివారం జరిగిన నార్వేజియన్ ప్రీమియర్ లీగ్ (టిప్పెల్జియాన్) నార్వేకు చెందిన స్టాబీక్ ఎఫ్‌సీ తరఫున బరిలోకి దిగాడు. దీంతో యూరోప్‌లోని టాప్ లీగ్‌లో ఆడిన తొలి భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు. 2014లో స్టాబీక్తో ఒప్పందం చేసుకున్న సంధూ.. నార్వేజియన్ కప్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడాడు. కానీ టిప్పెల్జియాన్లో ఆడటం మాత్రం ఇదే తొలిసారి. స్టాబీక్ తొలి గోల్ కీపర్ సాయోబా మండీ (ఐవరీకోస్ట్) స్థానంలో బరిలోకి దిగిన భారత స్టార్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. యూరోప్‌లో టాప్ డివిజన్ మ్యాచ్‌లో ఆడటం చాలా ఉత్సాహాన్నిచ్చిందంటూ మ్యాచ్ అనంతరం ట్విట్టర్లో ట్వీట్ చేశాడు.
సెల్టిక్ ఎఫ్‌సీలో సలీమ్
1936లో బెంగాల్ ఫుట్‌బాలర్ మొహమ్మద్ సలీమ్ స్కాటిష్ టాప్ టైర్‌కు చెందిన ‘సెల్టిక్ ఎఫ్‌సీ’ తరఫున ఆడినా.. ప్రీమియర్ డివిజన్ వరకు వెళ్లలేకపోయాడు. అయితే రెండు నెలల పాటు స్కాట్లాండ్లో మ్యాచ్‌లు ఆడినా అతని రికార్డులు పెద్దగా బయటకు రాలేదు. భారత్‌కు స్వాతంత్రం వచ్చిన తర్వాత మాజీ కెప్టెన్ బైచూంగ్ భూటియా ఇంగ్లిష్ మూడో డివిజన్ జట్టు ‘బూరి ఎఫ్‌సీ’కి 1999-2000లో ప్రాతినిధ్యం వహించాడు. 2012లో ప్రస్తుత జాతీయ జట్టు కెప్టెన్ సునీల్ చెత్రి ‘లిస్బన్’ జట్టు తరఫున ఆడాడు.