కేజీబీవీలపై ఇక నిరంతర నిఘా
కెమెరాల కొనుగోలుకు టెండర్లు
ఎస్ఎస్ఏ కార్యాలయానికి అనుసంధానం
ఖమ్మం : రెండు కేజీబీవీల్లో పైలెట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో సత్ఫలితాలు రావడంతో జిల్లాలోని అన్ని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగానే టెండర్లు కూడా పిలిచారు.
బాలికల విద్యను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నెలకొల్పిన కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలల్లో ఆశించిన స్థాయి ఫలితాలు రావడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున విడుదల చేసిన నిధులు పక్కదారి పడుతున్నాయని, విద్యార్థినులకు మెనూ అమలు చేయకుండా సరుకులు దారి మళ్లిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అంతేకాకుండా పలు కేజీబీవీల్లో ఎస్ఓ, సీఆర్టీలు సక్రమంగా విధులకు హాజరు కావడంలేదని, విద్యార్థుల సంఖ్యను కూడా ఎక్కువగా చూపిస్తూ హాజరు నమోదు చేస్తున్నారనే విమర్శలతో పలువురు అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఈ వ్యవహారమంతా అ«ధికారులు పర్యవేక్షించడం, తనిఖీలకు వెళ్లినప్పుడు అంతా సర్దుకొని తర్వాత షరా మామూలుగానే ఉండటం పరిపాటిగా మారింది. ఈ పరిస్థితి నేరుగా గమనించేందుకు కేజీబీవీ ప్రవేశ ద్వారం ముందు ఒక కెమెరా, స్టోర్‌రూమ్‌లో మరో కెమెరాను అమర్చి వీటికి నెట్ సౌకర్యం కల్పిస్తారు. అక్కడి నుంచి ఎస్ఎస్ఏ కార్యాలయంలోని పీడీ గదిలో ఉన్న ఎల్ఈడీ టీవీకి నెట్ ద్వారా అనుసంధానం చేస్తారు. తద్వారా జిలా కార్యాలయంలో ఉండి కేజీబీవీల్లో ఏం జరుగుతుందో నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కెమెరాకు అమర్చిన పరికరంలో నెల రోజుల డేటా కూడా రికార్డు అవుతుంది. ఎక్కడి నుంచి ఏ ఫిర్యాదు వచ్చినా, ఆయా కేజీబీవీలకు సంబంధించిన సీసీ కెమెరాను ఓపెన్ చేసి రికార్డు అయిన విషయాలను గమనిస్తారు.
పైలెట్ ప్రాజెక్టుతో సత్ఫలితాలు
జిల్లాలోని వెంకటాపురం, పెనుబల్లి కేజీబీవీల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సత్ఫలితాలు ఇవ్వడంతో రాష్ట్రంలోని అన్ని కేజీబీవీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో మొత్తం 26 కేజీబీవీలు ఉన్నాయి. వీటిలో ఖమ్మం అర్బన్ కేజీబీవీలో ఐదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు, మిగిలిన వాటిల్లో 6 నుంచి10వ తరగతి వరకు చదివే విద్యార్థులు 4,315 మంది ఉన్నారు. జిల్లాలో మిగిలిన 24 కేజీబీవీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు కొనుగోలు ప్రక్రియ ప్రారంభించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు కొనుగోలు కోసం టెండర్లు ఆహ్వానించారు.
పర్యవేక్షణ పెంపుకోసం
రవికుమార్, ఎస్ఎస్ఏ జిల్లా ప్రాజెక్టు అధికారి
కేజీబీవీల పనివిధానంలో మార్పు, బోధన, మెనూ, సరుకులకు భద్రత, అపరిచిత వ్యక్తుల కట్టడి వంటి విషయాలను తెలుకునేందుకు సీసీ కెమెరాలు ఉపయోగపడుతాయి. అక్కడ ఏం జరుగుతుందో జిల్లా కార్యాలయం నుంచి తెలుసుకొని తగిన సూచనలు చేసేందుకు అవకాశముంది. కెమెరాల కొనుగోలుకు టెండర్లు పిలిచాం.