రిషి సునాక్ స్థానంలో టోరీల సారథిగా బేడ్‌నాక్.. తొలి నల్లజాతి మహిళగా రికార్డు
లండన్: బ్రిటన్ విపక్ష నేతగా, కన్జర్వేటివ్ పార్టీ సారథిగా కేమీ బేడ్‌నాక్ ఎన్నికయ్యారు. నైజీరియా మూలాలున్న 44 ఏళ్ల కేమీ ఈ ఘనత సాధించిన తొలి నల్లజాతి మహిళగా రికార్డు సృష్టించారు. మూడు నెలల పాటు జరిగిన పార్టీపరమైన ఎన్నికల్లో మాజీ మంత్రి రాబర్ట్ జెన్రిక్ను బేడ్‌నాక్ ఓడించారు. ఆమెకు 53,806 ఓట్లు రాగానే జెన్నిక్కు 41,388 ఓట్లతో సరిపెట్టుకున్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో రాజీనామా చేసిన మాజీ ప్రధాని రిషి సునాక్ స్థానంలో ఆమె పార్టీ పగ్గాలు స్వీకరించారు. ఈ సందర్భంగా సునాక్‌కు బేడ్‌నాక్ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన స్థానంలో ఇంకెవరున్నా ఈ కష్టకాలంలో పార్టీ కోసం అంతగా కష్టపడేవారు కాదంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. సునాక్ కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. పార్టీ సారథిగా గొప్పగా రాణిస్తారని ఆశాభావం వెలిబుచ్చారు. ప్రధాని కియర్ స్టార్మర్ కూడా బేడ్నాక్కు శుభాకాంక్షలు తెలిపారు. ఒక నల్లజాతి మహిళ తొలిసారి కన్జర్వేటివ్ పార్టీ పగ్గాలు స్వీకరించడాన్ని చరిత్రాత్మక పరిణామంగా అభివర్ణించారు. బేడ్‌నాక్ నార్త్‌వెస్ట్ ఎసెక్స్ నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.