పాత 500 నోటు మార్పుకోవాలనుకుంటున్నారా?
హైదరాబాద్ : పాత 500, 1000 రూపాయల నోట్లు ఎలా వదిలించుకోవాలని బాధపడుతున్నారా..? హైదరాబాద్ వాసులకు ఓ గుడ్న్యూస్.. ఎర్రగడ్డ రైతు బజార్లో ప్రత్యేక కౌంటర్ పెట్టారు. కేంద్రీయ భండార్ సంస్థ ఆధ్వర్యంలో 500 రూపాయల విలువైన నిత్యావసరాల ప్యాక్ అమ్ముతున్నారు. పాత నోట్లు ఇచ్చినా తీసుకుంటారు.
కాగా పెద్ద నోట్ల రద్దు ప్రభావం రైతు బజార్లపైనా తీవ్రంగా పడిన విషయం తెలిసిందే. పది రోజులుగా.. రైతు బజార్లు, కిరాణషాపులు, పండ్ల మార్కెట్లు వెలవెలబోతున్నాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే మార్కెట్లు జనాలు లేక ఖాళీగా కనిపిస్తున్నాయి. చిల్లర లేక, ఉన్న పాత నోట్లను మార్పుకోలేక సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కూరగాయల ధరలు కూడా విపరీతంగా పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
ఈ నేపథ్యంలో ఎర్రగడ్డ రైతు బజార్లో పాత రూ.500 నోటు మార్పిడికి కేంద్రీయ భండార్ సంస్థ శనివారం కొత్త పథకం ప్రవేశపెట్టింది. ఏడు నిత్యావసర వస్తువులను రూ.500లకే అందచేసేలా వెసులుబాటు కల్పించింది. దీంతో ఎర్రగడ్డ రైతుబజారులో నేటి నుంచి పాత రూ.500 నోటు మార్పిడి అమల్లోకి వచ్చింది.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తోపుడు బండ్లు, రైతు బజార్లు, పాల కేంద్రాలు, కిళ్లీ బడ్డీలు తదితర చిరు వ్యాపారాలకు ఇప్పుడు అమ్మకాలు పడిపోయి వెలవెలబోతున్నాయిు. రోజంతా రోడ్డు పక్కన బళ్లు పెట్టి, దుకాణాలు తీసి పడిగాపులు పడినా ఇప్పుడు వారికి కూలి డబ్బులు కూడా గిట్టక చిరువ్యాపారుల కుటుంబాలు పస్తులు ఉండాల్సి వస్తోంది. రద్దు చేసిన పాత నోట్లు చిరు వ్యాపారులు తీసుకోలేరు. అలా అని రూ.2 వేల కొత్త నోటుకు చిల్లర ఇవ్వలేక బేరాలు వదులుకుంటున్నారు. మార్కెట్లో వంద నోట్ల తీవ్ర కొరత చిరు వ్యాపారాన్ని దారుణంగా దెబ్బతీస్తోందని వాపోతున్నారు.
పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో సామాన్యప్రజలు ఎదుర్కొంటున్న తిప్పలు రోజురోజుకూ పెరుగుతున్నాయేగానీ తగ్గడం లేదు. పదిరోజులైనా పరిస్థితి ఏ మాత్రం చక్కబడటంలేదు. అన్ని ప్రాంతాల్లో కరెన్సీ అత్యవసర స్థితి ఏర్పడింది. ప్రజలకు సమయం బ్యాంకులు, పోస్టాఫీసులు, ఏటీఎంల వద్దే గడిచిపోతోంది. చిన్నా, పెద్దా, మహిళలు, వృద్ధులు తేడా లేకుండా అందరూ క్యూలైన్లలోనే తమ ఓపికను, చెమటను ధారబోస్తున్నారు. గంటలపాటు క్యూల్లో నిల్చున్నా చివరికి అక్కడ తగినంత నగదు లేకపోవడంతో ఉసూరుమంటూ వెనక్కివెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి.