జూనియర్ పై సీనియర్ల అకృత్యం
కోజికోడ్: ర్యాగింగ్ బారిన పడిన కేరళ నర్సింగ్ విద్యార్థిని ఒకరు చావుబతుకుల్లో ఉంది. సీనియర్స్ కిరాతకం కోజికోడ్ కు చెందిన 19 ఏళ్ల దళిత యువతి ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టింది. గత 9నకర్ణాటకలో ఈ ఘటన చోటు చేసుకుంది. గుల్బర్గాలోని అల్ ఖమర్ నర్సింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న కేరళ విద్యార్థిని సీనియర్లు ర్యాగింగ్ చేశారు. ఆమెతో మరుగుదొడ్లు శుభ్రం చేయడానికి వాడే ఫినాయిల్ బలవంతంగా తాగించారు.
బాధితురాలిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారం రోజుల పాటు ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా ఆమె కోలుకోలేదు. దీంతో ఆమెను కోజికోడ్ మెడికల్ కాలేజీకి తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని, ఫినాయిల్ తాగడం వల్ల అంతర్గత అవయవాలు దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారు.
కూలి పనులు చేసుకుని జీవించే తాను కూతురు చదువు కోసం రూ. 3 లక్షలు అప్పు చేశానని బాధితురాలి తల్లి వెల్లడించింది. ర్యాగింగ్ జరగలేదని, కుటుంబ సమస్యల కారణంగానే బాధితురాలు ఫినాయిల్ తాగిందని నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్తేర్ పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనపై గుల్బర్గా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.