ఓనంతో పులకించిన తీరం
ఒంగోలు, న్యూస్‌లైన్:
కేరళీయుల సంప్రదాయ పండుగ ఓనంను జిల్లాలోని కేరళవాసులు కొత్తపట్నం తీరం ఒడ్డున ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. పదేళ్లుగా వీరు ఓనం పండుగను జరుపుకుంటున్నారు. కార్యక్రమంలో జిల్లాలోని వందకుపైగా కేరళ కుటుంబాలు పాల్గొన్నాయి. తొలుత కేరళవాసి శ్రీనివాస అయ్యర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేరళ మహిళలు పూలతో భుకలం(ముగ్గు) వేశారు. అనంతరం మళయాళ కల్చరల్ సొసైటీ అధ్యక్షుడు మాంటిస్సోరి ప్రకాష్‌బాబు మాట్లాడుతూ ఓనం హిందూ పండుగే అయినా కేరళలో కులమతాలకు అతీతంగా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని తెలిపారు. కేరళలో ఈ పండుగను రాష్ట్ర సాంస్కృతిక పండుగగా భావిస్తారన్నారు. మధ్యాహ్నం కేరళ వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. అనంతరం కైకొట్టికళి, బొప్పన, కచేరకళి, బలంఒడి తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వీటిలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
కార్యక్రమంలో మళయాళ కల్చరల్ సొసైటీ కార్యదర్శి ఈ సత్యం, కోశాధికారి ఎస్ విజయన్, ఉపాధ్యక్షులు సునీల్మీనన్, అశోక్, శిభిమైఖేల్, ఓక్బ్రిడ్జి స్కూల్ ప్రిన్సిపాల్ మనో, సెయింట్ మేరీస్ స్కూల్‌కు చెందిన నోబుల్, డియో, మనోజ్ పాల్గొన్నారు