కేజ్రీవాల్ కు మోదీ సలహా...
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఓ సలహా ఇచ్చారట. అవును.... ఇటీవల ఒక సమావేశంలో ఎడతెరిపి లేని దగ్గుతో బాధపడుతున్న కేజ్రీవాల్‌ను గమనించిన మోదీ ఓసారి యోగా గురు డా.నాగేంద్రని సంప్రదించమని సూచించారట. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటినుండీ నాగేంద్ర ఆయనకు చికత్స అందిస్తున్న విషయం తెలిసిందే. దాంతో మోదీ సలహాను అందుకున్న కేజ్రీవాల్ .. యోగా గురును త్వరలోనే సంప్రదిస్తాన్నట్లు సమాచారం.
కేజ్రీవాల్‌ను విపరీతమైన దగ్గు, షుగర్ పీడిస్తున్నాయని యోగా గురు డాక్టర్ నాగేంద్ర చెబుతున్నారు. అనేక ఆరోగ్య సమస్యలకు... జీవన విధానంలో మార్పులు, స్పెషలైజ్డ్ యోగా దోహద పడతాయని ఆయన అన్నారు. కాగా కర్ణాటక కు చెందిన 72 సంవత్సరాల నాగేంద్ర... స్వామి వివేకానంద యోగా అనుసంధాన్ సంస్థాన్ ద్వారా దాదాపు రెండు లక్షల మంది ఆస్తమా రోగులకు చికిత్స అందించారు. మెకానికల్ ఇంజనీరింగ్ లో పీహెచ్డీ చేసి, అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాలో శాస్త్రవేత్తగా సేవలందించిన ఆయన ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్శిటీకి కన్సల్టెంట్‌గా కూడా పనిచేశారు. యోగా మీద నాగేంద్ర 35 పుస్తకాలను రాశారు. ప్రఖ్యాత యోగా గురు బికెఎస్ అయ్యంగార్ నుండి ''యోగ శ్రీ'' బిరుదును కూడా అందుకున్నారు.