కాళిదాసు కవితావైభవం కుమారసంభవం
డాక్టర్ కేసాప్రగడ సత్యనారాయణ
రాజమహేంద్రవరం కల్చరల్ : ఉపనిషత్తులు, ఆరణ్యకాలు, వేదవాజ్ఞ్మయానికి మాత్రమే ప్రాథాన్యం ఉన్న రోజుల్లో మహాకవి కాళిదాసు లౌకికమైన కావ్యజగత్తులోకి తన రచనలు తీసుకువచ్చాడు. ఆయన కవితావైభవానికి దర్పణంగా కుమారసంభవం కావ్యాన్ని చెప్పుకోవచ్చునని రామాయణ రత్నాకర డాక్టర్ కేసాప్రగడ సత్యనారాయణ అన్నారు. నన్నయ వాజ్మయ వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం ఆదిత్య డిగ్రీ కళాశాలలో జరిగిన సాహితీ కాళిదాసం సభలో ఆయన కుమార సంభవము– పార్వతీ కల్యాణము అనే అంశంపై ప్రసంగించారు. తొలిరేయి విద్వాంసురాలయిన కాళిదాసు భార్య విద్యాధరి చొరవ తీసుకుని ‘అస్తి కశ్చిత్ వాగ్విశేషః’ మాటలాడుకోవడానికి ప్రత్యేకమైన మాటలే లేవా అని అడిగింది. ఇందులో మొదటిదయిన ‘అస్తి’ కాళిదాసు అనంతర కాలంలో రచించిన కుమారసంభవంలో తొలి పదం, కశ్చిత్ అన్నది మేఘసందేశంలో తొలి పదం, వాగ్విశేషః అన్నది రఘువంశంలో తొలిపదమని కేసాప్రగడ వివరించారు. వేదవ్యాసుని కలం నుంచి జాలువారిన శివపురాణాన్ని స్వీయకపోల కల్పనలతో కుమారసంభవంగా, వాల్మీకి రామాయణాన్ని రఘువంశంగా ఆయన మలిచాడని కేసాప్రగడ వివరించారు. రసికత్వం లేనివారికి నా కవిత్వం వినిపించే దౌర్భాగ్యం తనకు పట్టకూడదని కాళిదాసు కోరుకున్నాడని అన్నారు. దక్షయజ్ఞంలో శివుని అర్ధాంగి నిరాదరణకు గురి అవుతుంది, స్త్రీ అత్తింటిలో నిరాదరణకు గురికావడం మాట ఎలా ఉన్నా, పుట్టింటివారు స్త్రీని నిరాదరిస్తే, ఆ కుటుంబం సర్వనాశనమవుతుందని కేసాప్రగడ అన్నారు. శివుడు తపమాచరించిన ప్రదేశంలోనే పార్వతి తపస్సు చేయడం, శివపార్వతుల కల్యాణం తదతర అంశాలను వివరిస్తూ కేసాప్రగడ ఒక్క కుమారసంభవం నుంచి మాత్రమే కాకుండా బిల్హణుడు, శ్రీనాథుడు, భాష్యకారాచార్యులు, కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి, రచించిన పద్యాలను అలవోకగా ఉట్టంకించారు. సభాధ్యక్షుడు డాక్టర్ సప్పా దుర్గాప్రసాద్ ఆదిశంకరులు రచించిన ‘గంగాతరంగ రమణీయజటాకలాపం’ శ్లోకానికి నృత్యాభినయం చేశారు. నన్నయ వాజ్ఞయ వేదిక ప్రధాన కార్యదర్శి చింతలపాటి శర్మ కేసాప్రగడ ప్రసంగాన్ని షడ్రసోపేతమైన విందుగా అభివర్ణించారు. సప్పా దుర్గాప్రసాద్ చేతులమీదుగా ప్రధాన వక్త కేసాప్రగడ సత్యనారాయణను సత్కరించారు.
నేడు చింతలపాటి శర్మ ప్రసంగం
శనివారం రాష్ట్రపతి పురస్కార గ్రహీత చింతలపాటి శర్మ ‘మేఘసందేశము–విప్రలంభము’ అనే అంశంపై ప్రసంగించనున్నారు.