చదివించే బాధ్యత నాదే
కొరుక్కుపేట: పదవ తరగతి, ప్లస్‌టూ పరీక్షల్లో మెరిట్ సాధించి ఇంజినీరింగ్, మెడిసిన్ లాంటి ఉన్నత చదువుల్లో సీటు సంపాదించుకున్న విద్యార్థులకు దానికి అయ్యే మొత్తం ఖర్చుతో చదివించే బాధ్యత తనదేనని కెన్సస్ అధినేత నరసారెడ్డి హామీ ఇచ్చారు. చెన్నై టీనగర్‌లోని కేసరి మహోన్నత పాఠశాలలో మూడేళ్లుగా సాయంత్రం సమయంలో అదనపు తరగతులకు హాజరయ్యే పదవ తరగతి, ప్లస్‌టూ విద్యార్థులకు నరసారెడ్డి శుక్రవారం నుంచి సాయంకాల అల్పాహార విందు కార్యక్రమాన్ని పునః ప్రారంభించారు. కార్యక్రమానికి కెన్సస్ అధినేత నరసారెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి టీనగర్ కేసరి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపాలయ్యా అధ్యక్షత వహించారు. విద్యార్థులను ఉద్దేశించి నరసారెడ్డి మాట్లాడుతూ మూడేళ్లుగా కేసరి మహోన్నత పాఠశాల ఉత్తమ ఫలితాలను సాధిస్తూ నగరంలో ప్రత్యేక గుర్తింపు పొందడం సంతోషంగా ఉందన్నారు. విద్యతో ఏదైనా సాధించవచ్చునన్నారు. కార్యక్రమంలో ముందుగా గోపాలయ్య మాట్లాడుతూ మూడేళ్లుగా టీనగర్ కేసరి మహోన్నత పాఠశాల మంచి ఉత్తీర్ణత సాధిస్తుందన్నారు. తమ పాఠశాల ఉత్తమ ఫలితాలు సాధించడానికే నరసారెడ్డి పాత్ర ఉందని అన్నారు. పాఠశాల ఉపాధ్యక్షులు రాధాకృష్ణ, ఆస్కా సభ్యులు ఎరుకలయ్య, కృష్ణ, సాయినాథ్, శ్రీధర్, శ్రీనివాసులు పాల్గొన్నారు.