అమ్మ మృతి వెనుక కుట్ర
కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆరోపణ
పెరంబూర్: దివంగత సీఎం జయలలిత మరణం వెనుక కుట్ర దాగి ఉందని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆరోపించారు. ఈ కుట్రల బయటకు తీసేందుకు కేంద్రం సీబీఐ విచారణను జరిపించాలని కోరారు. ఈ మేరకు శనివారం కేతిరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొంటూ జయలలిత ఆరోగ్య వివరాలు, చికిత్సలకు సంబం«ధించిన సమగ్ర సమాచారం సుప్రీం కోర్టుకు సమర్పించాలని విన్నవించారు.
జయలలిత ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సమయంలో ఆస్పత్రి నుంచి తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాల ప్రకటనలపై విచారణ జరిపించాలన్నారు. ఇక, ఉప ఎన్నికల్లో ఆమె వేలి ముద్ర వేసినట్టు నిర్ధారణ కావడం గురించి ఆరా తీయాలని కోరారు. ఆస్తుల లావాదేవీలను నిలిపివేయాలని, సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసు పూర్తి అయ్యే వరకూ, ఆమెకు సంబంధించిన ఆస్తులకు ఎలాంటి క్రయ విక్రయాలు, బదిలీలు చేయ కూడదని తాను సుప్రీం కోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసినట్టు గుర్తు చేశారు. ఇక, జయలలిత మరణం వెనుక ఉన్న మిస్టరీ ఛేదించేందుకు సీబీఐ విచారణ జరిపించాలని తాను ఓ వెబ్సైట్లో పేర్కొనగానే, అందుకు నిమిషాల వ్యవధిలో 40 వేల మంది ఆమోదం తెలిపినట్టు వివరించారు. అందరూ సీబీఐ విచారణ జరిపించాల్సిందేనని పట్టుబడుతూ తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేశారన్నారు.
ఇక, సీబీఐ విచారణ కోరుతూ తాను ప్రధాని మంత్రి మోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడులను ఢిల్లీలో కలిసి వినతి పత్రం సమర్పించినట్టు తెలిపారు. అలాగే, తమిళనాడు ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వంకు శనివారం తాను లేఖ రాసినట్టు పేర్కొన్నారు. జయలలిత మరణం వెనుక ఉన్న కుట్రను బయటకు తీయాలని , ప్రజల కోరిక మేరకు సీబీఐ విచారణ జరిపించేందుకు కేంద్రాన్ని కోరాలని విన్నవించినట్టు తెలిపారు.
అమ్మ మీదున్న గౌరవాన్ని చాటుకోవాలని సూచించినట్టు చెప్పారు. అలాగే, తెలుగు విద్యార్థులకు గతంలో జయలలిత ఇచ్చిన హామీని నెరవేర్చాలని సూచించినట్టు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో జయలలితకు అభిమాన లోకం ఉందని, హైదరాబాద్‌లో ఆమెకు చెందిన స్థలంలో జ్ఞాపకార్థం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం స్మారక మందిరాన్ని నిర్మించాలని ఆ లేఖలో పేర్కొనట్టు కేతిరెడ్డి వివరించారు. అలాగే, ఢిల్లీలో సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డిని సైతం కలిసి వినతి పత్రం సమర్పించినట్టు చెప్పారు.
అమ్మకు రజనీ అభిమానుల నివాళి
తమిళసినిమా: ఇటీవల అందరి ఆశలను నిరాశ చేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిన జయలలితకు మృతికి తమిళ ప్రజలు కన్నీరు మున్నీరుగా ఏడ్చిన విషయం తెలిసిందే. ఏ విషయంలోనైనా ముందుండే సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులు శనివారం అమ్మ కు ఘన నివాళులర్పించారు. సుమారు ఐదు వేల మంది అభిమానులు మెరీనా బీచ్ వద్ద న్న జయలలిత సమాధిని శనివారం దర్శించి పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు.
ట్రాఫిక్ రామస్వామికి అస్వస్థత
టీనగర్: సామాజిక వేత్త ట్రాఫిక్ రామస్వామి శనివారం స్వల్ప అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. ట్రాఫిక్ రామస్వామి(83) సామాజిక సమస్యలపై అనేక సార్లు కోర్టులో పలు కేసులు దాఖలు చేశారు. మద్రాసు హైకోర్టులో శనివారం ఉదయం ఓ కేసు విచారణకు హాజరైన ట్రాఫిక్ రామస్వామి హఠాత్తుగా స్పృహ తప్పి కిందపడ్డారు. దీంతో ఆయనను వెంటనే స్థానిక ఆళ్వారుపేటలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ అత్యవసర చికిత్స విభాగంలో చికిత్సలనంతరం ఆయన కోలుకోవడంతో సాధారణ వార్డుకు మార్చారు.